Grand Nursery Mela in Hyderabad: గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న.. గ్రాండ్ నర్సరీ మేళాను పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రారంభించనున్నారు. ఐదురోజుల పాటు సాగే ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా పేరెన్నికగన్న నర్సరీలు, అంకుర కేంద్రాలు, సంస్థలు స్టాళ్లు ఏర్పాటు చేయనున్నాయి. దాదాపు 140కి పైగా స్టాళ్లు కొలువుతీరనున్నాయి.
అనూహ్య వాతావరణ మార్పుల నేపథ్యంలో పర్యావరణహితం దృష్ట్యా.. కొత్త రకాల ప్లాంట్స్, విత్తనాలు, టిష్యూ కల్చర్ ప్లాంట్స్, ఇతర సేంద్రీయ ఎరువులు, జీవన ఎరువులు అన్నీ ఒకే గొడుకు కింద లభ్యం కానున్నాయి. దేశీయ పండ్ల మొక్కలు, దేశీయ, విదేశీ అందమైన పూల మొక్కలు, ఇండోర్, అవుట్ డోర్ ప్లాంట్స్.. కాక్టస్, సెక్యులెంట్స్, ప్రత్యేకించి తైవాన్ ప్లాంట్స్, సెరామిక్, మట్టి, ప్లాస్టిక్ పాట్స్ విక్రయించనున్నారు.
అవే కాకుండా భిన్న టెక్నాలజీస్, నీమ్ కేక్, రెడ్ సాయిల్, డంగ్ కంపోస్టు, బోన్ మీల్ వంటివి ప్రకృతి ప్రేమికులు, రైతులకు అందుబాటులో పెట్టి ప్రదర్శించడంతోపాటు.. విక్రయించనున్నామని తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ ఖలీద్ అహ్మద్ జమీర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్యాన రంగంలో కొత్త పోకడలు వస్తున్నాయి. అపారమైన అవకాశాలు ఉండటంతో యువత ఈ రంగం వైపు మొగ్గు చూపుతున్న వేళ.. అనేక సంస్థలు నూతన పంటలు పరిచయం చేస్తున్నాయి.
వాతావరణ ప్రతికూల పరిస్థితులు తట్టుకునే టిష్యూ కల్చర్ మొక్కలు: సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఖర్జూరం పంట మొక్కలు.. ఈ వేదికపై పరిచయం చేయనున్నారు. వాతావరణ ప్రతికూల పరిస్థితులు తట్టుకునే ఈ టిష్యూ కల్చర్ మొక్కలు ఒక ఎకరంలో 70 నుంచి 80 వరకు నాటుకుంటే 9 ఏళ్ల తర్వాత రూ.20 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో.. పలువురు ఔత్సాహిక రైతులు తమ సొంతంగా ఖర్జూరం పంట సాగు చేపట్టడం ద్వారా అద్భతమైన ఫలితాలు సాధిస్తున్నారు.
ఇంట్లోనే ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకునే మొక్కలు: వాతావరణ కాలుష్యం, ఉష్ణతాపం తగ్గించుకునేందుకు.. ఇంట్లోనే ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకునే మొక్కలు పెంపకం ప్రాచుర్యం పొందుతుంది. ఈ తరుణంలో ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా కొబ్బరి నారతో తయారు చేసిన కుండీలు పరిచయం కానున్నాయి. భిన్న ఆకృతుల్లో దీర్ఘకాలంపాటు మన్నిక ఉండే.. ఈ అందమైన కుండీల్లో మట్టికి బదులు కోకోపిట్ ఉపయోగించవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు.
రోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు సాగే.. గ్రాండ్ నర్సరీ మేళా సందర్శించేందుకు ప్రవేశ రుసుం రూ.30, విద్యార్థి బృందాలకు 50 శాతం రాయితీ కల్పించారు. తెలుగు రాష్ట్రాలు సహా ప్రత్యేకించి జంటనగరాల నుంచి రైతులు.. ప్రకృతిప్రేమికులు పెద్ద ఎత్తున ప్రదర్శనకు తరలిరావాలని ఆ సంస్థ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
"ఈ వేదికపై పూలు, పండ్ల మొక్కల స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇండోర్, అవుట్ డోర్ ప్లాంట్స్.. కాక్టస్, సెక్యులెంట్స్ ప్లాంట్లు ఉంటాయి. అదేవిధంగా నీమ్ కేక్, రెడ్ సాయిల్, డంగ్ కంపోస్టు, బోన్ మీల్ అందుబాటులో ఉంటాయి." - ఖలీద్ అహ్మద్ జమీర్, తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజేషన్ ఛైర్మన్
ఇవీ చదవండి: టీచర్లకు గుడ్‌న్యూస్.. బదిలీలకు జీవో జారీ చేసిన సర్కార్
ఘనంగా నడ్డా చిన్నకుమారుడి వివాహం.. హాజరైన ప్రముఖులు.. 28న హిమాచల్‌లో రిసెప్షన్..