పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అభ్యర్థులు పల్లె, పట్నం అనే తేడా లేకుండా తిరుగుతూ పట్టభద్రులను కలుసుకుని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. నల్గొండ జిల్లా త్రిపురారంలో నల్గొండ-ఖమ్మం-వరంగల్ కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్‌ను కార్యకర్తలకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జానారెడ్డి పరిచయం చేశారు. భాజపా, తెరాస ప్రజలను వంచిస్తున్నాయని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఎమ్మెల్సీ పనిచేసిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
భాజపా ప్రచారం
వరంగల్ -ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ భాజపా అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి హన్మకొండ పబ్లిక్ గార్డెన్‌లో ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీగా పట్టం కడితే నిరుద్యోగుల పక్షాన మండలిలో పోరాడతానని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించే గొంతుకు మద్దతివ్వాలని... హైదరాబాద్ , రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరీ సతీష్ పట్టభద్రులను కోరారు. విజ్ఞాన్ కళాశాల సమీపంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అధ్యాపకులతో సమావేశమైన ఆయన గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
పెయిడ్ న్యూస్‌కు అడ్డుకట్ట
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ప్రకటనల ఆమోదం, చెల్లింపు వార్తల పరిశీలనకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సామాజిక మాధ్యమాల్లో ప్రచురితమయ్యే, ప్రసారమయ్యే వార్తలను పరిశీలించి పెయిడ్ న్యూస్‌కు ఈ కమిటీ అడ్డుకట్ట వేయనుంది.
ఇదీ చదవండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థిగా సురభి వాణీదేవి