Medical colleges: రాష్ట్రంలో 2023-24 ఏడాదికి కొత్తగా 8 వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఒక్కో కళాశాలలో 100 చొప్పున మొత్తం 800 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. వైద్య కళాశాలల ఏర్పాటు, అనుబంధ ఆసుపత్రుల అప్‌గ్రేడేషన్‌కు రూ.1,479 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఎం.రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త వైద్య కళాశాలలు.. రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, జనగామ జిల్లాల్లో రానున్నాయి. ఆయా జిల్లాల్లో వైద్య కళాశాలలను ఏర్పాటు చేసేందుకు వైద్య విద్య సంచాలకులు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ ప్రతిపాదనల్ని పరిశీలించిన సర్కార్ కళాశాలల ఏర్పాటుకు అనుమతించింది. వాటికి అవసరమైన మౌలిక సదుపాయాల కోసం నిధుల్ని విడుదల చేసింది. కళాశాలల ఏర్పాటుకు అవసరమైన భవనాలు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు, పరికరాలు, సామాగ్రి సమీకరణ బాధ్యతను టీఎస్‌ఎంఎస్‌ఐడీసీకి అప్పగించింది.
నాగర్‌కర్నూల్ వైద్య కళాశాలకు 150 సీట్లు..
నాగర్ కర్నూల్‌లో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ వైద్య కళాశాలకు 2022-23 ఏడాదికి 150 ఎంబీబీఎస్ సీట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) కళాశాల ప్రిన్సిపల్‌కు ఎల్‌ఓఐ జారీ చేసింది. కళాశాల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, బోధన సిబ్బంది, ప్రయోగశాలలు, విద్యార్థుల వసతి, మానవ వనరులపై మెడికల్ అసెస్‌మెంట్ రేటింగ్‌బోర్డు నివేదిక పరిశీలించి ఆమోదించింది. దీనిపై ప్రిన్సిపల్ రమాదేవి హర్షం వ్యక్తం చేశారు. అనుమతి లభించేందుకు కృషి చేసిన సిబ్బందిని అభినందించారు.
ఇవీ చదవండి: SI Preliminary Exam: నేడే ఎస్సై ప్రాథమిక పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
పరిశోధనలతోనే పురోగమనం... ప్రణాళికాబద్ధ ప్రస్థానం తక్షణావసరం!