Governor Tamilisai On NABARD Foundation Day celebration : దేశంలో గ్రామీణాభివృద్ధి, సుస్థిర వ్యవసాయ అభివృద్ధిలో నాబార్డ్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సమీపంలో ఉన్న నాబార్డ్ ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన 42వ నాబార్డ్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ చింతల సుశీల గోవింద రాజులు, ఎస్‌బీఐ డిప్యూటీ మేనిజింగ్ డైరెక్టర్ అమిత్ ఝింగ్రాన్, ఇతర ఉన్నతాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాబార్డ్ ఆర్థిక సాయంతో విజయవంతంగా నడుస్తున్న అంకుర కేంద్రాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రదర్శనను గవర్నర్ ప్రారంభించారు. పలు స్టాళ్లు కలియ తిరిగి నిర్వాహకులతో ముచ్చటించారు. అనంతరం పలు ప్రచురణలు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన ఆమె.. సమాజంలో రైతులు లేకపోతే దేశం లేదని అభిప్రాయపడ్డారు. రైతే రాజుగా కీర్తించారు. గిరిజనుల అభివృద్ధి కోసం నాబార్డు వాటర్‌షెడ్, పండ్ల తోటల పెంపకానికి ఆర్థిక సాయం అందిస్తోందని కితాబు ఇచ్చారు.
NABARD Foundation Day Celabrations At Hyderabad : గ్రామీణ ప్రాంతాల్లో టెక్నాలజీ ఉపయోగించి వ్యవసాయం చేయడంలో నాబార్డ్ కృషి చాలా గొప్పదని కొనియాడారు. రాజ్‌భవన్ తరపున ఆరు గ్రామాలను దత్తత తీసుకున్నామని.. ఈ గ్రామాల్లో నాబార్డ్ కూడా అనేక కార్యక్రమాలు చేస్తోందని అభినందించారు. ప్రత్యేకించి స్వయం సహాయ మహిళా బృందాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, వ్యవస్థాపకులకు ఆర్థిక స్వావలంబన కోసం పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు.
1992లో 500 సెల్ఫ్హెల్ఫ్గ్రూప్స్ (ఎస్‌హెచ్‌జీ)లతో మొదలైన ఉద్యమం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా 1కోటి 2 లక్షల బృందాల సభ్యులు, 14కోట్ల గృహ యజమనాలు భాగస్వామ్యులయ్యారని పేర్కొన్నారు. చిరుధాన్యాల అంతర్జాతీయ సంవత్సరం వేళ ప్రతి ఒక్కరూ రోజు ఉదయం, సాయంత్రం ఒక రాగి లడ్డూ చొప్పున తినాలని సూచించారు. మహిళలు రోజు వారీ ఆహారంలో చిరుధాన్యాల ఉత్పత్తులు జోడిస్తే అందంతోపాటు మంచి ఆరోగ్యంగా ఉంటారని గవర్నర్ తమిళిసై సూచించారు.
"సమాజంలో రైతులు లేకపోతే దేశం లేదు. రైతే రాజు.. గిరిజనుల అభివృద్ధి కోసం నాబార్డు వాటర్‌షెడ్, పండ్ల తోటల పెంపకానికి ఆర్థిక సాయం అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో టెక్నాలజీ ఉపయోగించి వ్యవసాయం చేయడంలో నాబార్డ్ కృషి చాలా గొప్పది. చిరుధాన్యాల అంతర్జాతీయ సంవత్సరం వేళ ప్రతి ఒక్కరూ రోజు ఉదయం, సాయంత్రం ఒక రాగి లడ్డూ చొప్పున తినాలి. ఆహారంలో చిరుధాన్యాల ఉత్పత్తులు జోడిస్తే అందంతో పాటు మంచి ఆరోగ్యం వస్తుంది."- తమిళిసై సౌందర రాజన్, గవర్నర్
ఇవీ చదవండి: