Tamilisai Soundara Rajan Respond Hussainsagar Cleanliness : హుస్సేన్‌సాగర్ లాంటి సరస్సు చాలా రాష్ట్రాల్లో లేదని.. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్.. 37వ సెయిలింగ్ వీక్ ముగింపు వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈనెల 5నుంచి 8వ తేదీ వరకు హుస్సేన్‌సాగర్‌లో పోటీలు జరగగా.. సీనియర్ ర్యాంకింగ్ ఈవెంట్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి తమిళిసై ట్రోఫీలు అందజేశారు. ఎంతో మంది ప్రతిభ గల సెయిలర్స్‌ని హుస్సేన్‌సాగర్ ఇచ్చిందని చెప్పారు.
హైదరాబాద్‌లో ఇంత అందమైన హుస్సేన్‌సాగర్ లేక్ ఉండటం అదృష్టమని.. తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. సాగర తీరంలో ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకులకి అభినందనలు తెలిపారు. సెయిలింగ్ పోటీల్లో ఆడవాళ్లు సైతం పోటీ పడటం సాధారణ విషయం కాదని చెప్పారు. మహిళలు జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారని.. సెయిలింగ్ అనేది జీవిత పాఠాలను నేర్పుతుందని తమిళిసై సౌందర రాజన్ వ్యాఖ్యానించారు.
నీటిలో గాలిని తట్టుకొని పడవ నడపినట్లుగానే.. జీవితంలో కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగాల్సి వస్తుందని తమిళిసై సౌందర రాజన్ వివరించారు. సెయిలింగ్ విభాగంలో అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కి పథకాలు వచ్చాయని పేర్కొన్నారు. రాబోయే ఆసియా, ఒలింపిక్ క్రీడల్లో పథకాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే హుస్సేన్‌సాగర్ పరిశుభ్రతపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Tamilisai Soundara Rajan Latest News : హుస్సేన్‌సాగర్ తెలంగాణకి ప్రకృతి ఇచ్చిన ఒక గిఫ్ట్ లాంటిదని తమిళిసై సౌందర రాజన్ పేర్కొన్నారు. జాతీయ అంతర్జాతీయ సెయిలర్లు ఇక్కడ సెయిలింగ్ చేస్తూ ఉంటారని పేర్కొన్నారు. ఇలాంటి హుస్సేన్‌సాగర్‌ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత రాష్ట్ర సర్కార్‌పై ఉందని వివరించారు. ప్రభుత్వంతో పాటు ప్రజలపై కూడా బాధ్యత పంచుకోవాలని సూచించారు. గతంలో ఇక్కడ సెయిలింగ్ చేసేటప్పుడు పాములు, చేపలు, కప్పలు కనిపించేవని.. కానీ కాలుష్యం వలన ఇప్పుడు అలాంటివి కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హుస్సేన్‌సాగర్‌ని శుభ్రపరచాలని ఇందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. వచ్చే సంవత్సరం ఇలాంటి సమస్యలు లేవని చెప్పే విధంగా ఉండాలని ఆశిస్తున్నట్లు తమిళిసై సౌందర రాజన్ వెల్లడించారు.
"రాష్ట్రానికి హుస్సేన్‌సాగర్ ఒక గిఫ్ట్ లాంటిది. హుస్సేన్‌సాగర్‌ను శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వంతో పాటు ప్రజలపై కూడా బాధ్యత ఉంది. గతంలో హుస్సేన్‌సాగర్‌లో సెయిలింగ్ చేసేటప్పుడు పాములు, చేపలు, కప్పలు కనిపించేవని అధికారులు చెబుతున్నారు. కానీ కాలుష్యం వలన ఇప్పుడు అలాంటివి కనిపించడం లేదని అంటున్నారు. హుస్సేన్‌సాగర్‌ని శుభ్రపరచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను." - తమిళిసై సౌందర రాజన్, గవర్నర్
ఇవీ చదవండి: Pending Bills Issue: పెండింగ్ బిల్లులపై నిర్ణయం.. ఒకటి తిరస్కరించిన గవర్నర్
Goa Formation Day Celebrations in Rajbhavan : 'దేశం ఒక్కటే అన్న భావన ప్రజల్లో ఉండాలి'