ముస్లిం సోదరులకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీక అని అన్నారు. మహ్మద్ ప్రవక్త బోధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ముస్లిం సోదరులకు సూచించారు. ఇస్లాం సంప్రదాయంలో బక్రీద్ పండుగకు ప్రత్యేక స్థానం ఉందని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ఉన్న కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఇళ్ల నుంచే ప్రార్థనలు చేసుకోవాలని గవర్నర్ సూచించారు. ఒకవేళ మసీదులకు వెళ్తే అక్కడ భౌతిక దూరం పాటించాలని కోరారు. ప్రజలు గుంపులు గుంపులుగా చేరకుండా పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
కరోనా నేపథ్యంలో...
ముస్లిం సోదరులు బక్రీద్ పర్వదినాన్ని వేడుకలా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులు ఎక్కడున్నా.. ఓ చోటికి చేరి సంతోషంగా గడుపుతారు. నూతన వస్త్రాలతోపాటు వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేస్తారు. కానీ కొవిడ్ నేపథ్యంలో ఈసారి పెద్దగా సందడి వాతావరణం కనిపించడం లేదు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం మినహా మిగతా ప్రదేశాల్లో హడావుడి లేదు. సీఎం, గవర్నర్ సైతం కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే వేడుకలు చేసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు 50 శాతం కేటాయించాలి: కృష్ణాబోర్డుకు లేఖ