కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు బహుముఖ విధానాన్ని అనుసరించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. పరీక్షలను పెంచటం, టీకాల కార్యక్రమాన్ని విస్తృతం చేయటం, ప్రజలు నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రజల్లో అవగాహన తీసుకురావటంపై లీడ్ ఇండియా ఫౌండేషన్ అమెరికా ఛాప్టర్ నిర్వహించిన అంతర్జాతీయ వెబినార్‌లో గవర్నర్ పాల్గొని ప్రసంగించారు.
కరోనా బాధితులు ఎక్కువ మంది ఆస్పత్రులకు వెళ్తున్నందున మౌలిక సదుపాయాలపై ఒత్తిడి ఎక్కువగా ఉందని గవర్నర్ పేర్కొన్నారు. ఇంకా ఎక్కువ ఒత్తిడిని భరించలేమన్నారు. వైరస్ వ్యాప్తి నివారణకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవటంపై దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. భవిష్యత్తులో అందరికీ సరిపడా టీకా డోసులు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. డాక్టర్లు, నర్సులు ఇతర ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు.