దేశంలో అన్నీ అమ్మేయడంలో కేంద్రంలోని మోదీ సర్కారు విజయం సాధిస్తోందని ఎమ్మెల్యే బాల్కసుమన్ విమర్శించారు. అభివృద్ధి వార్షిక సగటు రేటు దేశంతో పోలిస్తే తెలంగాణదే ఎక్కువని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధిని జీడీపీ లెక్కలే చెబుతాయన్నారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్‌కు రాసిన బహిరంగ లేఖపై బాల్కసుమన్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను కేంద్రం విస్మరించిందని.. వాటికోసం భాజపా ఎంపీలు కేంద్రంలో మాట్లాడాలన్నారు.
కాళేశ్వరం సహా అనేక ప్రాజెక్టులు నిర్మించి తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని బాల్కసుమన్ అన్నారు. రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలు కేసీఆర్ అభిమానులేనని... సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా కేసీఆర్ పాలన సాగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలను బికారులన్నందుకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో అంతా విషమే కాని.. విషయం లేదని విమర్శించారు.
కేంద్రంలో భాజపా విధానం ఏమిటంటే... ప్రకటించాలి, ప్రారంభించాలి, అమ్మేయాలి. తెలంగాణ నుంచి ప్రాతనిధ్యం వహిస్తున్న నలుగురు భాజపా ఎంపీలు కేంద్ర ఇచ్చిన హామీలపై సూటిగా ప్రశ్నించాలి. కేంద్రం దొడ్డు వడ్లు కొననంటుంది రాష్ట్రంలో ఉన్న నలుగురు భాజపా ఎంపీలు ఎందుకు మాట్లాడడం లేదు. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ పేరుతో తెలంగాణలోని రైల్వే ఆస్తులను లీజుకిచ్చే ప్రయత్నం చేస్తోంది. మీరు ఇక్కడ పాదయాత్రలు, ప్రభుత్వాలకు లేఖలు, మాపై విమర్శలు వీటన్నింటినీ కట్టిపెట్టి... కేంద్రం రాష్ట్రానికి చేయాల్సిన విషయాలపై దృష్టి పెట్టండి. ఇప్పటికైనా తెలంగాణకు సంబంధించిన పనులపై శ్రద్ధ పెట్టండి తప్ప... రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించి ప్రజల్లో పలచనయ్యే పరిస్థితి తెచ్చుకోవద్దు. తెరాస పార్టీపై అడ్డగోలుగా నోరు పారేసుకుంటే ఊరుకునేది లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేస్తే రైతులు ఊరుకోరు. -బాల్క సుమన్, ఎమ్మెల్యే
ఇదీ చూడండి: bandi sanjay letter to kcr: మంత్రివర్గంలో వారికి అవకాశమివ్వాల్సిందే.. కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ