ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లిన తెలుగు రాష్ట్రాల ప్రజలు కరోనా ప్రభావం వల్ల అక్కడి చెట్ల కిందే బతుకెళ్లదీస్తూ.. నరకయాతన పడుతున్నారు. గత 3 నెలలుగా తినడానికి తిండి.. ఉండడానికి వసతి లేక రోడ్డుపైనే జీవనం సాగిస్తున్నారు. వీరిని గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక (జీడబ్ల్యూఏసీ) ఆధ్వర్యంలో కలిసి.. వారికి భోజనం, మాస్క్‌లు, నిత్యావసర సరుకులు, కనీస అవసరాల కోసం ఆర్థిక సహాయం చేసినట్లు వేదిక అధ్యక్షులు కృష్ణ డొనికెని తెలిపారు.
గత 15 రోజుల నుంచి వీరికి అన్నంపెట్టి.. వారి బాగోగులు చూసుకుంటున్న సోషల్ సర్వీస్ ఫర్ గల్ఫ్ ఇండియన్ అధ్యక్షులు జైత నారాయణ, సునీల్‌గౌడ్ దొమ్మాటి, ఎరుమళ్ల మల్లేశ్‌లు విషయాన్ని తమ దృష్టికి తీసుకువచ్చారని కృష్ణ పేర్కొన్నారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి ఆదుకోవాలని కోరినట్లు తెలిపారు.
కరోనా తీవ్రత తగ్గాక బాధితులను స్వదేశానికి పంపించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కరోనా ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది ప్రజలు గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని.. ప్రభుత్వం చొరవ చూపి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఇదీ చూడండి: ఈ ఏడాది సాధారణంకన్నా అధిక వర్షపాతం