రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ గడువును పొడిగించడంపై ఉపాధ్యాయ సంఘాలు హైదరాబాద్లో ఆందోళనకు దిగాయి. తక్షణమే పొడిగింపు నిర్ణయాన్ని ప్రభుత్వ వెనక్కి తీసుకోవాలంటూ ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాంపల్లిలోని హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించాయి. జులై 2108 నుంచి అమలు చేయాల్సిన వేతన సవరణ గడువును ఈ ఏడాది డిసెంబర్ వరకు కొనసాగించడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పొట్ట కొట్టే విధంగా ఉందని ఐకాస నాయకులు ఆరోపించారు.
రెండేళ్లు సమయం తీసుకున్నా..
రెండేళ్లు సమయం తీసుకున్న తరువాత కూడా పీఆర్సీ అమలుపరచకపోవడం ఏంటని ఉద్యోగులు ప్రశ్నించారు. మధ్యంతర భృతి మంజూరు, సకాలంలో డీఏలు చెల్లించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో అందరి బ్రతుకులు బంగారం అవుతాయని చెప్పిన ముఖ్యమంత్రి తమ పట్ల మాత్రం సవతి ప్రేమ చూపుతున్నారని విమర్శించారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని విరమించుకోకపోతే ఐక్యంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతికు మెమోరాండం అందజేశారు.
ఇవీ చూడండి: నిర్భయ: ఉరి పడుతుందని.. తల పగలగొట్టుకున్నాడు!