‘‘పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగురేయుదుమా జాతి పతాకం’’ ఈ గీత రచయిత కోసం తెలియకపోయినా, రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల్లో.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పండగలు, పాఠశాలల్లో ఈ పాట వినిపిస్తోంది. ఇంతటి కీర్తిని సంపాదించుకున్న పాట రచయిత ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా వాసి కావడం అందరికీ గర్వకారణం. పార్వతీపురంలో నివసిస్తున్న గంటేడ గౌరునాయుడు కలం నుంచి 1990లో జాలువారింది. ఇప్పుడు మహారాష్ట్ర విద్యాశాఖ తొమ్మిదో తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ఈ పాటను మొదటి పాఠంగా విద్యార్థులకు బోధించనుంది.
గౌరునాయుడు స్వస్థలం కొమరాడ మండలం దళాయిపేట. గిరిజన సంక్షేమ శాఖలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేశారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవానికి ప్రత్యేకంగా దేశభక్తి ప్రబోధించే గీతాన్ని రాయడం, పిల్లల చేత దాన్ని పాడించడం అతనికి ఇష్టమైన పని. అలా 1990లో గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడి బాలికోన్నత పాఠశాలలో పిల్లలతో పాడించడానికి పుట్టిన గీతమే ‘‘పాడుదమా స్వేచ్ఛాగీతం’’. కొన్ని పాఠశాలల్లో వేనవేల మంది విద్యార్థులు పాల్గొన్న నృత్యరూపకంలో కూడా ఈ పాటను ప్రదర్శించారు.
అక్షర విజయం ప్రారంభ గీతంగా..
1993లో జిల్లాలో సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమంగా ‘‘అక్షర విజయం’’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రారంభ గీతంగా అప్పటి కలెక్టరు వి.నాగిరెడ్డి ‘‘పాడదుమా స్వేచ్ఛా గీతం’’ ఎంపిక చేశారు. లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌నారాయణ్ తమ పార్టీ ప్రచార గీతాల సీడీలో ప్రారంభ గీతంగా చేర్చారు. దీనికి సాలూరు వాసురావు సంగీతం సమకూర్చారు.
ఆనందంగా ఉంది..
"మహారాష్ట్రలో తొమ్మిదో తరగతి పాఠంలో నా పాటను చేర్చారని అక్కడి విద్యాశాఖలో పనిచేస్తున్న భాస్కరరెడ్డి ఫోను చేసి చెప్పడంతో ఆనందం వేసింది. మరిన్ని రాష్ట్రాల్లో తెలుగు విద్యార్థులకు చేరే సాధనంగా ఇది ఉపకరిస్తుంది" - గౌరునాయుడు
- ఇదీ చూడండి: పోలీసుల క్రూరత్వం- మాస్కు లేదని.. నడిరోడ్డుపై!