ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఈ నెలాఖరు వరకు టీవీ పాఠాలు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. వారికి 20వ తేదీ నుంచి టీవీల ద్వారా పాఠాల ప్రసారాన్ని మొదలుపెట్టాలని విద్యాశాఖ నిర్ణయించినా... అందుకు ప్రభుత్వం ఇంకా ఆమోదం తెలపలేదు.
ముందు తీసుకున్న నిర్ణయాల ప్రకారం గురువారం నుంచి 6-10 తరగతులకు పాఠాలు ప్రసారం కావాలి. ఈ నెలాఖరు వరకు విద్యా సంస్థలు తెరవడంపై కేంద్రం నిషేధం ఉండటం, హైకోర్టులో కేసు ఈ నెల 27న మళ్లీ విచారణకు రానున్న నేపథ్యంలో ప్రభుత్వం డిజిటల్ పాఠాలకు పచ్చజెండా ఊపలేదని చెబుతున్నారు.
ఇబ్బంది ఏముంది?
ఇదిలా ఉండగా... న్యాయస్థానం ఆన్‌లైన్ పాఠాలు వద్దని అనలేదని, ప్రైవేట్ పాఠశాలలకు అనుమతి ఇచ్చారా? లేదా? అన్నదే ప్రశ్నించిందని నిపుణులు అంటున్నారు. విద్యా సంస్థలు తెరవడంపై నిషేధం ఉన్నా ఎవరి ఇంట్లో వారు ఉంటూ పాఠాలు వినడానికి ఇబ్బంది ఏముందని ప్రశ్నించారు. అయితే కొందరు విద్యార్థుల ఇళ్లలో టీవీలు లేవని, అలాంటి ఇళ్లలోని పిల్లలు పాఠాలు వినాలంటే ఎక్కడికి వెళ్లాలనే సమస్య వచ్చిందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
ఇవీ చూడండి: గోదారమ్మ పరవళ్లు... నిండుకుండల్లా జలాశయాలు