జోనల్ విధానానికి అనుగుణంగా కొత్త పోస్టింగుల్లో చేరాకే అప్పీళ్లు సహా స్పౌజ్ కేసుల కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ చేసింది. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా చేసే కేటాయింపులపై అభ్యంతరాలు ఉంటే ఉద్యోగులు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ముందు కొత్త పోస్టింగుల్లో చేరాకే అప్పీల్‌కు అవకాశం కల్పించారు. జిల్లా కేడర్ ఉద్యోగులు జిల్లా శాఖాధిపతికి.. జోనల్, మల్టీజోనల్ కేడర్ ఉద్యోగులు శాఖాధిపతికి అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చిన అప్పీళ్లన్నింటినీ సంబంధిత శాఖ కార్యదర్శికి శాఖాధిపతులు నివేదించాలి. పూర్తి విచారణ తర్వాత త్వరితగతిన అప్పీళ్లను పరిష్కరించాలని అన్ని శాఖల కార్యదర్శులను ప్రభుత్వం ఆదేశించింది.
స్పౌజ్ కేసులకు మార్గదర్శకాలివే..
స్పౌజ్ కేసులకు కూడా ప్రభుత్వం మార్గదర్శకాలు ప్రకటించింది. ఉద్యోగస్థులైన భార్యాభర్తలు ఒకే చోట పనిచేసేలా స్పౌజ్ కేసులను పరిశీలించనుంది. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా చేసే కేటాయింపుల్లో చేరిన తర్వాతే స్పౌజ్ కేసుల కింద దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. జిల్లా కేడర్ ఉద్యోగులు జిల్లా శాఖాధిపతికి... జోనల్, మల్టీజోనల్ కేడర్ ఉద్యోగులు శాఖాధిపతులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. శాఖాధిపతులు స్పౌజ్ కేసు దరఖాస్తులన్నింటినీ పరిశీలించి తగిన సిఫారసులతో సంబంధిత శాఖ కార్యదర్శికి నివేదించాల్సి ఉంటుంది. వాటన్నింటిని పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అన్ని శాఖల కార్యదర్శులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి:
Local cadre Report: సొంత జిల్లాలకు ఉద్యోగులు... తొలిరోజు 25 శాతం మంది రిపోర్ట్