Gold ATM at Ameerpet : బంగారు ప్రియులకు గోల్డ్ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. గోల్డ్ సిక్కా లిమిటెడ్(Gold Sikka Limited) ఆధ్వర్యంలో అమీర్‌పేట్ మెట్రోస్టేషన్ ఆవరణలో గోల్డ్ ఏటీఎంను నిర్వాహకులు ప్రారంభించారు. అర గ్రాము నుంచి 20 గ్రాముల(grams) వరకు బంగారాన్ని ఈ ఏటీఎం ద్వారా కొనుగోలు చేయొచ్చు. డెబిట్, క్రెడిట్ కార్డు లేదా యూపీఐ(UPI) పేమెంట్ ద్వారా బంగారు, వెండి కాయిన్లను కొనుగోలు చేసుకోవచ్చు. బ్యాంకులు ఏర్పాటు చేసిన ఏటీఎంలో డబ్బులు తీసుకున్న విధంగానే గోల్డ్ సిక్కా ఏటీఎంలో బంగారు, వెండి కాయిన్లను తీసుకునే ఏర్పాట్లు చేశారు.
Sikka Gold ATM in Hyderabad : ఏటీఎంలో నిర్దేశించిన విధంగా లావాదేవీ పూర్తయిన వెంటనే మనం ఎంచుకున్న బంగారం కాయిన్లు బయటికి వస్తాయి. అర గ్రాము నుంచి 20 గ్రాముల వరకు బంగారం లేదా వెండి కాయిన్లను ఎంపిక చేసుకొని నిర్దేశించిన మొత్తాన్ని డెబిట్, క్రెడిట్ లేదా యూపీఐ పేమెంట్స్ ద్వారా చెల్లించాలి. లావాదేవీ(transaction) పూర్తయిన వెంటనే ఏటీఎం నుంచి కాయిన్లు బయటికి వస్తాయి.
కొనుగోలు చేసిన కాయిన్లకు సంబంధించిన బిల్లు కూడా ఏటీఎంలోనే ప్రింట్ వస్తుంది. లావాదేవీల సందర్భంలో ఏదైనా సాంకేతిక సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించేలా సాంకేతిక బృందాన్ని సైతం గోల్డ్ సిక్కా యాజమాన్యం ఏర్పాటు చేసుకుంది. నగదు చెల్లించినా, కాయిన్లు రాకపోతే 24 గంటల్లోపు నగదు తిరిగి వినియోగదారుడి ఖాతాలో జమ అవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇది ప్రారంభించిన రోజునే వినియోగదారుల నుంచి ఆశించినదాని కంటే మంచి స్పందన వస్తోందని గోల్డ్ సిక్కా లిమిటెడ్ యాజమాన్యం తెలిపింది.
Gold ATM Since 2022 : గత ఏడాది డిసెంబరు 3 నుంచే ప్రారంభమైన ఈ గోల్డ్ సిక్కా ఏటీఎం ప్రజాదరణ ఎంతో పొందింది. దేశంలో మొదటిసారిగా ఏర్పాటైన సిక్కా గోల్డ్ ఏటీఎంలకు విశేష స్పందన బాగా రావడంతో పలు చోట్ల ఏర్పాట్లకు ప్రణాళికలు రచిస్తోంది. హైదరాబాద్‌లో పలు చోట్ల గోల్డ్ ఏటీఎంలు ఏర్పాటు చేయాలని సిక్కా సంస్థ గత సంవత్సరమే నిర్ణయం తీసుకుంది. అందులో ఒకటి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కాగా, మరొకటి ఓల్డ్ సిటీలో ఏర్పాటు చేయనున్నారు. ఇంకొకటి కూకట్‌పల్లిలో ఏర్పాటు చేయనున్నారు. తాజాగా అమీర్‌పేట్ మెట్రోస్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేశారు.
Gold ATM Founder : కాగా సిక్కా గోల్డ్ ఏటీఎంను రూపొందించింది ఓ తెలుగు వ్యక్తి కావడం గమనార్హం. ఆయనే ఓపెన్స్ క్యూబ్స్ వ్యవస్థాపకుడు పి. వినోద్. 2017లోనే హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ ఆవిష్కరణలపై పని చేయడం మొదులుపెట్టారు. ఈ క్రమంలోనే ఏడేళ్ల క్రితం హైదరాబాద్‌లో ‘ఓపెన్ క్యూబ్స్’ అనే అంకుర సంస్థ ప్రారంభించారు.
వినోద్ చేసిన పలు ప్రాజెక్టులు గుర్తింపు రావడంతో గోల్డ్ సిక్కా’ కంపెనీ నిర్వాహకులు గోల్డ్ ఏటీఎం తయారు చేయమంటూ వినోద్‌ని సంప్రదించారు. సిబ్బందితో కలిసి దాదాపు మూడు నెలలపాటు శ్రమించి వారు చెప్పినట్టే గోల్డ్ ఏటీఎం తయారు చేశారు. దీనికోసం సొంతంగా సాఫ్ట్‌వేర్ రూపొందించారు.
Gold ATM in Hyderabad: గోల్డ్ ఏటీఎంలో బంగారం నాణ్యతని నమ్మొచ్చా?