గోదావరి బేసిన్‌లో ఒక్క కొత్త ప్రాజెక్టు లేదని రాష్ట్ర నీటిపారుదల ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్ జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో పాల్గొన్న ఆయన... కాళేశ్వరం, తుమ్మిడిహట్టిలను కొత్త ప్రాజెక్టులుగా పరిగణించకూడదని స్పష్టం చేశారు.
తెలంగాణకు రావాల్సిన వాటా ప్రకారమే ఎత్తిపోతలు జరుగుతాయని వెల్లడించారు. పోలవరం, పట్టిసీమపై బోర్డు దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. పోలవరం నుంచి పట్టిసీమకు 80 టీఎంసీలు ఇస్తున్నారని తెలిపారు. టెలిమెట్రీల విషయం ఎక్కడా దాచిపెట్టట్లేదని చెప్పారు. సాంకేతిక సమస్యలపై కృష్ణా, గోదావరి బోర్డులకు స్పష్టంగా చెప్పామని వెల్లడించారు.
2014 జూన్ 2 వరకు పూర్తయిన ప్రాజెక్టుల గురించి అడగవద్దని చెప్పామని స్పష్టం చేశారు. గోదావరి బేసిన్‌లో 967 టీఎంసీల వాటా ఉందని వివరించారు. గోదావరి బేసిన్‌లో టెలిమెట్రీ ఏర్పాటుపై కమిటీ ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు.
గోదావరి కేటాయింపుల్లో నీటిని ఎక్కడైనా వాడుకోవచ్చని ట్రైబ్యునల్ చెప్పిందని రజత్‌కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర కేటాయింపుల్లో నుంచే ప్రాజెక్టులు చేపడుతున్నామని తెలిపారు. ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని చెప్పారు. డీపీఆర్‌లు ఇవ్వాలని బోర్డులు పదేపదే కోరుతున్నాయని వెల్లడించారు.
ప్రభుత్వ అనుమతితో ఇచ్చేందుకు ఇబ్బంది లేదని చెప్పామని తెలిపారు. తెలంగాణలో కొత్త ప్రాజెక్టులు చేపట్టలేదని... గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు నీరు తరలిస్తున్నందున 45 టీఎంసీలు కోరామని రజత్‌కుమార్ స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విషయాలను అపెక్స్ కౌన్సిల్ దృష్టికి తెస్తామని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక ఇక్కడి ప్రయోజనాల మేరకు ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. పోతిరెడ్డిపాడుపై రాతపూర్వకంగా కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. గోదావరిపై టెలిమెట్రీ ఏర్పాటుకు బోర్డు కమిటీని ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.