Twist in Tempo Driver Srinivas Issue: హైదరాబాద్ బోరబండ టెంపో డ్రైవర్ శ్రీనివాస్ కేసులో మిస్టరీ వీడటం లేదు. గోవాకు వెళ్లిన శ్రీనివాస్ తలకు శస్త్ర చికిత్స చేసి.. తలలోని భాగాన్ని పొట్టలో అమర్చినట్లు నిమ్స్ వైద్యులు గుర్తించారు. అసలు గోవాలో ఏం జరిగిందనే విషయంపై... ఆ రాష్ట్ర పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ చేరుకున్న గోవా పోలీసులు.. ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. అక్కడ పోలీసులతో మాట్లాడి నిమ్స్ ఆస్పత్రికి తరలి వెళ్లారు. శ్రీనివాస్‌కు ఏం జరిగిందనే అంశంపై వైద్యులతో మాట్లాడారు. తనపై ఎవరో దాడి చేశారని, అసలు ఏం జరిగిందో అర్ధం కావడం లేదని బాధితుడు చెబుతున్నారు.
అసలేం జరిగిందంటే..: గత నెల 19న 10 మంది ప్రయాణికులను టెంపో డ్రైవర్ శ్రీనివాస్ గోవాకు తీసుకువెళ్లారు. మరుసటి రోజు అదృశ్యమై మూడు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో నగరానికి తిరిగివచ్చారు. గోవాలో వెతికితే ఫలితం లేకపోవడంతో కుటుంబసభ్యులు అక్కడి అంజున పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అయితే.. గోవాలో అదృశ్యమైన శ్రీనివాస్ ఇటీవల హైదరాబాద్ చేరుకున్నాక అతడ్ని చూసిన కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తల, పొట్ట భాగంలో కుట్లు ఉండటం చూసి ఆందోళనకు గురయ్యారు. మత్తు మందు ఇచ్చి అవయవాలు తీసుకున్నారేమోనని కుటుంబసభ్యులు అనుమానించారు. రెండ్రోజుల క్రితం అతడిని బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ నిమ్స్‌లో చేర్పించారు. చికిత్స అనంతరం శ్రీనివాస్ నిమ్స్ నుంచి గురువారం డిశ్ఛార్జ్ అయ్యారు.
గోవాలో ఏం జరిగింది.: బోరబండ ఎస్‌ఆర్ నగర్ పరిధిలో శ్రీనివాస్ ఉంటుండటంతో.. గోవాలోని అంజున పోలీసులు ఇక్కడికి వచ్చి విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా శ్రీనివాస్ నివాసానికి వెళ్లనున్నారు. అయితే ఈ ఘటనలో అసలు గోవాలో ఏం జరిగిందో తెలియాలని శ్రీనివాస్ కుటుంబసభ్యులు కోరుతున్నారు. తలలో భాగాన్ని తీసి పొట్టలో ఎందుకు అమర్చారనే దానిపై కారణాలు తెలియాల్సి ఉంది. శ్రీనివాస్ చికిత్స కోసం ప్రభుత్వం తమను ఆదుకోవాలని కుటుంబీకులు విజ్ఞప్తి చేశారు. నిమ్స్‌లో బిల్లు కట్టలేక చికిత్స మధ్యలోనే ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: గులాబీ ఇళ్లపై నల్లజెండాలు.. కేంద్రంపై కొనసాగుతోన్న తెరాస పోరు