రైల్వే ఆస్తుల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా స్పష్టం చేశారు. దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో భద్రత, సరకు లోడింగ్, రైళ్ల రాకపోకలు, సమయపాలన తదితర అంశాలపై సికింద్రాబాద్లోని రైల్ నియంలో జీఎం వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. ఈ సమావేశంలో విజయవాడ, గుంతకల్, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్లకు చెందిన ఆరు డివిజనల్ రైల్వే మేనేజర్లు పాల్గొన్నారు.
భద్రతకు సంబంధించిన అన్ని అంశాలపై జీఎం సమీక్షించారు. నిఘా వ్యవస్థ లేని ప్రాంతాల్లో సీసీటీవీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని జీఎం డివిజనల్ రైల్వే మేనేజర్లను గజానన్ మాల్యా ఆదేశించారు. అసాంఘిక శక్తుల కదలికలను సీసీటీవీ ద్వారా పరిశీలించడం ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. జోన్‌లోని వివిధ ప్రాంతాల్లో నిలిపి ఉన్న బోగీలను సరైన విధంగా లాక్ చేసి ఉంచాలని, అన్ని రైల్వే ప్రాంగణాల్లో.. స్టేషన్ యార్డు, సైడిరగ్‌లలో భద్రతా చర్యలను చేపట్టాలన్నారు.
జోన్ పరిధిలో కొత్త డబ్లింగ్ సెక్షన్లను ఏర్పాటు చేసిన నేపథ్యంలో, రన్నింగ్ సిబ్బంది (లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్లు, గార్డు) కొత్తగా ఏర్పాటు చేసిన సిగ్నల్స్, సెక్షన్లను గురించిన రోడ్ లెర్నింగ్ (ఎల్‌ఆర్)ను పూర్తి చేయాలని గజానన్ సూచించారు. సాంకేతిక సిబ్బంది అందరూ రెండు నెలల వ్యవధిలో రిఫ్రెషర్ కోర్సును పూర్తి చేయాలన్నారు. సరకు రవాణా రైళ్ల సగటు వేగాన్ని గంటకు 51 కిలోమీటర్లకు పెంచడంలో అధికారుల కృషిని జీఎం ప్రశంసించారు.
ఇదీ చదవండి: భద్రతా ప్రమాణాలకు ప్రాధాన్యతనివ్వాలి: గజానన్ మాల్య