రాష్ట్రంలో జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు (Ginning Cotton Mills)ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీర్ఘకాలంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రోత్సాహక రాయితీ నిధుల విడుదల జాప్యం రీత్యా అదనపు భారం పడి మిల్లుల నిర్వహణ యజమానులకు భారంగా పరిణమిస్తోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేసిన ప్రభుత్వం... ఇచ్చిన ప్రోత్సాహం వల్ల ముందు చూపుతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కోట్లాది రూపాయలు వెచ్చించి 350 పైగా పత్తి జిన్నింగ్ మిల్లులు (Ginning Cotton Mills) ఏర్పాటు చేశారు. ఆర్ అండ్ సీ మేజర్స్ ప్రకారం వేసిన పీనల్ ఛార్జెస్‌ను పూర్తిగా రద్దు చేసి, ఫార్ములా - ఏ సర్టిఫికేట్ ఇండస్ట్రియల్ ఫార్ములేషన్ పాలసీ 2015-20కి ఇప్పించడం, కాటన్ జిన్నింగ్ ఇండస్ట్రీస్‌కు విద్యుత్ రాయితీ 2 రూపాయలు చెల్లింపులు అపరిష్కృతంగా ఉన్నాయి.
ప్రతి సీజన్‌లో లారీ యజమానుల సంఘాల బెదిరింపులు, అశాస్త్రీయంగా అద్దెల వడ్డన వంటి అంశాలు ప్రతిబంధకంగా మారాయి. 2021-22 ఖరీఫ్ సీజన్ ముగియనున్న నేపథ్యంలో దసరా పండుగ నుంచి పత్తి మార్కెటింగ్ సీజన్ ప్రారంభమవుతున్న వేళ.. జిన్నింగ్ పరిశ్రమ (Ginning Cotton Mills) సమస్యలు తెరపైకి వచ్చాయి. 2020-21లో పత్తి సీజన్‌లో గులాబీ పురుగు, ఇతర తెగుళ్లు, అధిక వర్షాల కారణంగా... ఆశించినంత పంట చేతికి రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొవిడ్ సంక్షోభం దృష్ట్యా పరిశ్రమ సరిగా నడవక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించకపోవడంతో కాటన్ జిన్నింగ్, ప్రెస్సింగ్ ఇండస్ట్రీస్ నడపలేనిస్థితిలో ఉన్నామని యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏడేళ్లుగా పెండింగ్‌లో..
రాష్ట్రంలో ఏటా పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిపోతోంది. పత్తి ఉత్పత్తయ్యే రాష్ట్రాల్లో తెలంగాణ 3వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో 55 నుంచి 60 లక్షల బేళ్లు పత్తి మార్కెట్‌కు రాబోతున్నాయి. మొత్తం సాగు కోటి 29 లక్షల ఎకరాల్లో పంటలు వేయగా... కేవలం పత్తి, వరి 70 శాతం మేర ఆక్రమించాయి. రాష్ట్రంలో రైతాంగానికి పత్తి పరిశ్రమ ఏర్పాటు చేయడం వల్ల అధిక ధరలు రావడానికి ప్రభుత్వానికి పన్నులు రూపంలో రూ.1200 కోట్ల ఆదాయం రావడానికి గుండెకాయలాంటిది పత్తి పరిశ్రమ. తెలంగాణలో 70 శాతం రైతాంగం, కార్మికులు... పత్తి, వరి పరిశ్రమపై ఆధారపడినప్పటికీ ప్రభుత్వం ఈ పరిశ్రమపై శ్రద్ధ చూపడటం లేదన్న విమర్శలు ఉన్నాయి. కొత్త పరిశ్రమలు రావడానికి చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం... ఉన్న పరిశ్రమలను కాపాడుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఒక్కో పరిశ్రమలో 100 నుంచి 200 మంది కార్మికులు పని చేస్తారు. ఒక పరిశ్రమ మూతపడితే ఆ కుటుంబాలు రోడ్డుపాలవుతాయి. పరోక్షంగా చాలా కుటుంబాలు ఇబ్బందులు పడతాయి. ఇది దృష్టిలో పెట్టుకుని ఏడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 500 కోట్ల రూపాయలను విడుదల చేసి తమను ఆదుకోవాలని జిన్నింగ్ మిల్లుల (Ginning Cotton Mills) యజమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.
రావాల్సిన రాయితీ ప్రోత్సాహకాల విషయాన్ని అనేకసార్లు ప్రభుత్వం, మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా.. ఏ మాత్రం ఫలితం లేదని యజమానుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ అంశంపై 2017 అక్టోబరు 31న మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సమక్షంలో భేటీ జరగ్గా పరిశ్రమకు రావాల్సిన 100 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని, ఆర్ అండ్ సీ మేజర్స్ పీనల్ ఛార్జెస్ రద్దు చేసి ప్రోత్సాహకాలు విడతల వారీగా విడుదల చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ విడుదలకు నోచుకోలేదు. 2019-20 కాటన్ సీజన్ ముందుకు మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డితో జరిగిన సమావేశంలో 150 కోట్ల రూపాయలు విడుదల చేసి మిగతావి విడతల వారీగా విడుదల చేస్తామని ఇచ్చిన భరోసా కార్యరూపం దాల్చలేదు. దసరా నుంచి పత్తి మార్కెటింగ్ సీజన్ ప్రారంభం కాబోతున్న తరుణంలో కనీసం ఇప్పటికైనా రావాల్సిన ప్రోత్సాహకాల బకాయిలు 500 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ కాటన్ మిల్లర్స్, ట్రేడర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
ఏడేళ్లుగా ప్రోత్సాహక రాయితీలు రాకపోవడంతో పలువురు మిల్లర్లు వడ్డీల భారంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. కొందరైతే మిల్లర్లు మూసివేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సీజన్‌లో పెద్ద ఎత్తున పత్తి రాబోతున్న తరుణంలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి తమ సమస్యలు పరిష్కరించాలని జిన్నింగ్ మిల్లుల యజమానులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: COTTON RECORD PRICE: కొత్త పత్తికి రికార్డు ధర రూ.7,610