GHMC on Deccan Sportswear Building Demolish: సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం జరిగిన భవనం కూల్చివేతకు జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. దక్కన్ స్పోర్ట్స్ వేర్ భవనం కూల్చివేతకు సంబంధిత అధికారులు టెండర్లను ఆహ్వానించారు. ఇద్దరి ఆచూకీపై స్పష్టత రాగానే కూల్చివేత ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లను అధికారులు సిద్దం చేస్తున్నారు. 1890 చదరపు అడుగుల్లో ఉన్న దక్కన్ స్పోర్ట్స్ వేర్ భవన నిర్మాణం కూల్చివేతకు రూ.33.86 లక్షలతో అధికారులు టెండర్లు పిలిచారు.
దక్కన్ స్పోర్ట్స్ వేర్ భవనం కూల్చివేతకు ఆధునాతన యంత్రాలను సమకూర్చాలని టెండర్లలో సూచించారు. భవనం చుట్టుపక్కన నివాసాలు ఉండడంతో వాటికి ఎలాంటి ప్రమాదం జరుగకుండా ఉండేలా కూల్చివేత పనులు చేయాలని అధికారులు నిర్ణయించారు. భవనం చుట్టూ తార్పాలిన్ ఏర్పాటు చేసి కూల్చివేయనున్నట్లు తెలిపారు. భవనంలో ఉన్న ఇద్దరి ఆచూకీ విషయమై పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఉత్తరాలు రాస్తున్నారు. సెల్లార్‌తో సహా అన్ని అంతస్తులను కూల్చివేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. కూల్చివేత సందర్భంగా 20కేఎంటీఎస్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయని జీహెచ్‌ఎంసీ అధికారులు అంచనా వేస్తున్నారు.
అగ్నిప్రమాదానికి గురైన దక్కన్ మాల్ ఏ క్షణమైనా పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉండటంతో, చుట్టుపక్కల ఉన్న వారికి ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు రోజులుగా మంటల్లో ఉన్న భవన సముదాయంలోని శ్లాబులు ఒక్కొక్కటిగా పెచ్చులూడుతూ వచ్చాయి. ఆదివారం 1, 2, 3 అంతస్తుల వరకూ శ్లాబులు కూలి సెల్లార్లో పడిపోయాయి. ఈ ప్రాంతంలో మంటలు ఎక్కువగా రావడం వల్లే స్టాల్ పూర్తిగా బలహీన పడి కూలిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. భవనం క్రమంగా బలహీనపడి కుప్పకూలే ప్రమాదం ఉన్నట్లు అధికారులు అంచనాకు వచ్చారు. భవనం చుట్టుపక్కల ఇళ్లను ఖాళీ చేసిన కుటుంబాలను ఎట్టిపరిస్థితుల్లోనూ లోపలకు అనుమతించబోమని తేల్చి చెప్పారు.
భవనంలో ఆరు అంతస్తులుండగా కేవలం నాలుగు అంతస్తులు పూర్తిగా కాలిపోయాయి. మిగతా రెండు అంతస్తుల్లోని వస్తువులు ఏమాత్రం కాలిపోకుండా ఉండటం చూసి అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మైనస్- 2 సెల్లార్లో ఉన్న గోదాం, దక్కన్ సామగ్రి కూడా కాలిపోకుండా అలాగే ఉన్నాయి. సెల్లార్, మొదటి, రెండవ, మూడవ అంతస్తుల్లో మాత్రమే సామాగ్రి మొత్తం కాలిపోయింది. అందుకే ఈ ఫ్లోర్లలో ఉండే శ్లాబులు కూలిపోయాయి. 4, 5, 6 అంతస్తుల్లో భవనంలోకి కేవలం పొగ మాత్రమే చేరటంతో వస్తువులు కొద్దిగా దెబ్బతిన్నాయి. అందులో ఉండే కొంత సామగ్రి చెక్కుచెదరకుండా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇవీ చదవండి: