గ్రేటర్ హైదరాబాద్‌లో నగరవాసుల సౌకర్యార్థం నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లను మరింత పరిశుభ్రంగా నిర్వహించడంతోపాటు... పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఇటీవల 7,400 మరుగుదొడ్లను 3,500 ప్రాంతాల్లో నిర్మించింది. ఈ టాయిలెట్ల నిర్వహణను స్థానిక ఏజెన్సీలకు టెండర్ నిబంధనల ప్రకారం అప్పగించింది. వీటిని ప్రతిరోజు మూడు నుంచి ఐదు సార్లు పరిశుభ్రపరిచేందుకు ఆయా ఏజెన్సీలకు కాంట్రాక్ట్‌ను అప్పగించారు.
ప్రస్తుతం కమర్షియల్ ప్రాంతాల్లో, ప్రధాన కూడళ్లలో ఉన్న టాయిలెట్లను కనీసం ఐదు, ఇతర ప్రాంతాల్లో మూడు సార్లు పరిశుభ్రపర్చేలా చర్యలు చేపట్టింది. ప్రతి టాయిలెట్‌కు క్యూఆర్ కోడ్ కేటాయించి ఆయా టాయిలెట్లను శుభ్రపరిచే సమయంతో పాటు.. ఈ టాయిలెట్ల నిర్వహణపై ప్రజాభిప్రాయ సేకరణను కూడా చేపట్టింది. వీటిని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్, అడిషనల్ కమిషనర్‌తో పాటు జోనల్ కమిషనర్లు ఎప్పటికప్పుడు ఆన్ లైన్లో సమీక్షిస్తున్నారు.
బీఓటీ పద్దతిలో నిర్వహణ..
ఇప్పటికే నగరంలోని దాదాపు 60 శాతంకు పైగా టాయిలెట్ల నిర్వహణ సక్రమంగా సాగుతూ నగరవాసులు వినియోగించుకుంటున్నారని అధికారులు తెలిపారు. నగరంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన లూ-కేఫేలు విజయవంతవగా.. కొత్తగా నిర్మించిన ఈ-టాయిలెట్లను కూడా బీఓటీ పద్దతిలో నిర్వహించాలని సంబంధిత ఏజెన్సీలకు తెలిపారు.
60శాతం పూర్తిస్థాయిలో...
ఆధునిక డిజైన్లతో నిర్మించిన ఈ టాయిలెట్లలో 90శాతం గాలి, 10 శాతం నీటిని వినియోగించి మరుగుదొడ్లను పరిశుభ్రపరుస్తున్నామని తెలిపారు. గతంలో హైదరాబాద్ నగరంలో టాయిలెట్ సౌకర్యంలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే నగరవాసులకు జీహెచ్ఎంసీ ఇటీవల నిర్మించిన 7,400 టాయిలెట్లలో 60శాతం పూర్తిస్థాయిలో ఉపయోగపడుతున్నాయని స్పష్టం చేశారు. వీటితో పాటు ఇతర ఏజెన్సీలు కూడా తమకు కేటాయించిన టాయిలెట్ల నిర్వహణకు కావాల్సిన యంత్రాలను వెంటనే కొనుగోలు చేసి నిర్వహణ చేపట్టాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ టాయిలెట్ల ఏర్పాటుతో హైదరాబాద్ నగరంలో బహిరంగ మలమూత్ర విసర్జన కూడా గణనీయంగా తగ్గిందని తెలిపింది.
ఇదీ చూడండి: వ్యర్థాల నుంచి విద్యుత్‌కు సన్నాహాలు : నిరంజన్ రెడ్డి