GHMC Mayor : హైదరాబాద్ ఉప్పల్‌లో జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మికి చేదు అనుభవం ఎదురైంది. సొంత పార్టీ నేతలే ఆమెను అడ్డుకునేందుకు యత్నించటం ఉద్రిక్తతలకు దారితీసింది. ఉప్పల్ పరిధిలోని చిలుకానగర్‌లో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు మేయర్ వెళ్లారు. స్థానిక ఎమ్మెల్యేను పిలవకుండా నియోజకవర్గంలో శంకుస్థాపనలు ఎలా చేస్తారంటూ ఉప్పల్ ప్రాంతానికి చెందిన బీఆర్‌ఎస్ శ్రేణులు మేయర్‌ను అడ్డుకునేందుకు యత్నించారు. ఎమ్మెల్యే వర్గీయులు, మేయర్ వర్గీయులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.
మేయర్ ప్రొటోకాల్ పాటించటం లేదంటూ ఎమ్మెల్యే వర్గీయులు నిరసన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న వారిపై మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యేను జోనల్ కమిషనర్ ఆహ్వానించారని.. తననూ జోనల్ కమిషనరే పిలిచారని మేయర్ విజయలక్ష్మి తెలిపారు. ఎమ్మెల్యేను తాను స్వయంగా ఆహ్వానించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ మేరకు కార్యకర్తలకు సర్దిచెప్పి మేయర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇవీ చూడండి..