గ్రేటర్ ఎన్నికల ఫలితాలు.. మరోమారు చర్చకు తెరలేపుతున్నాయి. మేయర్ ఎన్నికకు గడువు సమీపించడంతో పీఠాన్ని అధిరోహించేది ఎవరనే అంశంపై ఉత్కంఠ మొదలైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 10తో ప్రస్తుత పాలక మండలి గడువు పూర్తవుతుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎలాంటి సమాచారం లేదు. ఎక్స్ అఫీషియో సభ్యుల లెక్క తేల్చే ప్రక్రియను పురపాలక శాఖ పూర్తి చేయకపోవడం తదితర పరిణామా లను విశ్లేషిస్తే గడువులోపు మేయర్ ఎన్నిక జరుగుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది.
ఆ రికార్డులను పరిశీలించి...
జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లలో అధికార తెరాస 56 సీట్లు గెలుచుకుంది. భాజపా 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ రెండు డివిజన్లలో విజయం సాధించాయి. కొత్తగా గెలిచిన కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం మేయర్ ఎన్నిక తరువాతే ప్రమాణ స్వీకారం చేయాలి. జీహెచ్ఎంసీ చట్టం-1956 సెక్షన్ 5(1) ప్రకారం మేయర్, ఉపమేయర్ ఎన్నికలో కార్పొరేటర్లుగా గెలిచిన అభ్యర్థులతోపాటు, గ్రేటర్‌లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకూ ఓటు వేసే హక్కు ఉంటుంది. గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు వేరే ఏ ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎక్స్ అఫీషియోలుగా ఓటు హక్కు ఉపయోగించుకోని వారు మేయరును ఎన్నుకోవచ్చు. అందుకు సంబంధించిన రికార్డులను రాష్ట్ర ఎన్నికల సంఘం, పురపాలక శాఖ పరిశీలించి.. జీహెచ్ఎంసీ ఎక్స్ అఫీషియో సభ్యుల జాబితాను రూపొందిస్తాయి.
ఎన్నిక కాకుంటే..!
అదే సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం మేయర్ ఎన్నికకు ఏర్పాట్లను ప్రారంభించాలి. ఇందులో భాగంగా గెలిచిన 150 మంది అభ్యర్థుల పేర్లతో జనవరి 16న గెజిట్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 18లోపు మేయర్ ఎన్నికను విధిగా చేపట్టాలి. ఎక్స్ అఫీషియో సభ్యుల గుర్తింపు, మేయర్ ఎన్నిక ఏర్పాట్లు ఇప్పటి వరకు ఆరంభించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సమయానికి మేయర్ ఎన్నిక నిర్వహించాలని భావిస్తే ఫిబ్రవరి 16న ముహూర్తం ఉండొచ్చని విశ్వసనీయ వర్గాలు 'ఈనాడు'కు తెలిపాయి. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ లేకపోవడం, ఇతరత్రా రాజకీయ కారణాలతో ఎన్నికను వాయిదా వేయాలనుకుంటే ఫిబ్రవరి 10 అనంతరం ప్రత్యేక కమిషనర్‌ను నియమించి పరిపాలన కొనసాగించే అవకాశం ఉందని ఉన్నతాధికారులు అంటున్నారు.
ఇదీ చదవండి : ఆరోగ్యం.. ఆనందం... ఈ నందనవనం!