కొవిడ్ బారినపడి మృతిచెందుతున్న వారి అంత్యక్రియలకు ఇబ్బందులు తొలగనున్నాయి. ఎల్పీజీ, డీజిల్‌తో నడిచే దహనవాటికలతో సమస్యను పరిష్కరించేందుకు జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఉన్న వేర్వేరు శ్మశానవాటికల్లో షెడ్ల నిర్మాణం జరుగుతోంది. హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లలో ఎక్కువగా ఉపయోగించే ఆధునిక యంత్రాలను హైదరాబాద్‌కు తెప్పిస్తున్నామని, ఈ నెల 7న మొదటి పరికరం పటాన్‌చెరు చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు.
దాన్ని గుర్తించిన స్థానిక శ్మశానవాటికలో ఏర్పాటు చేసి నెలాఖరులోపు సేవలు ప్రారంభిస్తామంటున్నారు. ఇలా రెండు నెలల వ్యవధిలో మొత్తం 12 దహనవాటికలను అందుబాటులోకి తెస్తామని పేర్కొంటున్నారు. వాటి సేవలు అందుబాటులోకి వస్తే అంత్యక్రియలు వేగంగా జరుగుతాయి. మృతదేహం దహనానికయ్యే వ్యయం రూ.1,500లకు తగ్గుతుంది. పర్యావరణహిత విధానంలో అంతిమ సంస్కారాలు పూర్తవుతాయి.
ఎలా పనిచేస్తుంది..?
30 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవుతో నిర్మించే షెడ్డు కింద ఆధునిక దహనవాటికను ఏర్పాటు చేస్తారు. అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఒక మృతదేహాన్ని దహనం చేసేందుకు ఒక సిలిండర్ లేదా 20 లీటర్ల వరకు డీజిల్‌ను మండించాల్సి ఉంటుంది. మొదటి దహనానికి 90 నిమిషాల సమయం అవసరంకాగా.. కొనసాగింపులో 60 నుంచి 45 నిమిషాల్లో ఒక మృతదేహం బూడిద అవుతుంది.
దహనవాటిక ధర రూ.45,69,000
షెడ్డు, ఇతర ఏర్పాట్లకయ్యే వ్యయం రూ.45 లక్షలు