జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలను బల్దియా విడుదల చేసింది. గోడలమీద రాతలు, పోస్టర్లు, పేపర్లు అంటించడం, లేక మరే ఇతర విధంగా ప్రభుత్వ ఆవరణలను పాడు చేయడం నిషేధించింది. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వీలైనంత మేరకు ప్లాస్టిక్ పాలిథీన్తో తయారైన పోస్టర్లు, బ్యానర్ల వాడకం నివారించేందుకు ప్రయత్నించాలని అధికారులు సూచించారు.
ఎన్నికల కరపత్రం లేక పోస్టరుపై ఆ ప్రింటర్, పబ్లిషరు పేర్లు, అడ్రస్సులు లేకుండా ముద్రించరాదన్నారు. ప్రత్యేక ఉపకరణాలు ధరించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ వాటికి అయ్యే ఖర్చు మాత్రం అభ్యర్థి ఎన్నికల వ్యయ పట్టికలో నమోదు చేయాలన్నారు. ఎన్నికల పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు నుంచి.. అభ్యర్థి తన ఎన్నికల నిమిత్తం ప్రజలకు, సినిమాటోగ్రఫీ, టెలివిజన్ లేదా ఇతర తత్సమాన ప్రచార సాధనాలు వినియోగించుట కూడా నిషేధించారు.
లౌడ్ స్పీకర్లు వాడడానికి సంబంధిత పోలీసు అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి పొందాలని తెలిపారు. బహిరంగ సమావేశాలు రహదారి ప్రదర్శనల్లో లౌడ్ స్పీకర్లను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య, ఇతర సంందర్భాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతించబడతాయన్నారు. పబ్లిక్ సమావేశాలు రాత్రి 10 గంటల దాటిన తరువాత, ఉదయం 6 గంటల కన్నా ముందు నిర్వహించరాదని పేర్కొన్నారు.
ఎన్నికల పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచి పోలింగ్ ముగిసే వరకు ఎలాంటి పబ్లిక్ సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదని అధికారులు స్పష్టం చేశారు. అధికారిక యంత్రాంగం ద్వారా ఓటర్లకు అధికారిక ఫొటో గుర్తింపు స్లిప్ జారీ చేయబడుతున్నందున, అభ్యర్థులు అనధికారిక గుర్తింపు స్లిప్స్ ఇవ్వకూడదని బల్దియా అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: బస్తీ మే సవాల్: పట్టునిలుపుకోనేనా?.. పాగా వేసేనా?