నేడు నగరంలో జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా జరగనుంది. కొత్త ఆర్థిక సంవత్సరం పద్దును ఆమోదించుకొనేందుకు మంగళవారం ఉదయం 10 గంటలకు గ్రేటర్ పాలకమండలి సమావేశం కానుంది. సోమవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, తెరాస కార్పొరేటర్లు దిల్లీలో నిరసన దీక్షలో పాల్గొని రాత్రికే నగరానికి చేరుకున్నారు. మేయర్ అధ్యక్షతన జరగనున్న మూడో సమావేశంలో నగరంలో పలు అంశాలపై కార్పొరేటర్లు చర్చించనున్నారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రం దిల్లీలోనే ఉన్నారు. సుదీర్ఘ విరామం అనంతరం జరగనున్న బల్దియా పాలకమండలి సమావేశం వాడీవేడిగా జరుగుతుందని అంచనా వేస్తున్నారు. 2022-23 ఏడాదికి స్టాండింగ్ కమిటీ ఆమోదించిన రూ.6150 కోట్ల బడ్జెట్‌ను ఈ సమావేశంలో బల్దియా కౌన్సిల్ ఆమోదించనుంది. ప్రతి పక్షాలు నగరంలో తాగు నీరు కలుషితం, చిన్న కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు, ఇతర అంశాలు చర్చించే అవకాశం ఉంది.
ప్రశ్నించేందుకు సిద్ధమైన కార్పొరేటర్లు: అధికార పార్టీని ప్రశ్నించేందుకు ప్రతిపక్ష కార్పొరేటర్లు సిద్ధమవగా, వారిని ఎదుర్కొనేందుకు అధికార పక్షం కసరత్తు పూర్తిచేసింది. గ్రేటర్లో కొన్నేళ్లుగా చేపట్టిన అభివృద్ధి పనులు, మెరుగైన మౌలిక సౌకర్యాల కల్పన, రెండు పడక గదుల ఇళ్లు, ఇతర అంశాలపై కార్పొరేటర్లకు తాజాగా బల్దియా ఆర్థిక విభాగం ఇప్పటికే అవగాహన కల్పించింది.
బౌన్సర్లను సిద్ధం చేసిన జీహెచ్‌ఎంసీ: ఈ సమావేశంలో ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టే అవకాశముండటంతో జీహెచ్‌ఎంసీ అధికారులు 30 మంది మహిళా కానిస్టేబుళ్లు, 30 మంది కానిస్టేబుళ్లను, పదుల సంఖ్యలో బౌన్సర్లను సిద్ధం చేశారు. పాలకమండలి సమావేశాన్ని పురస్కరించుకొని జీహెచ్‌ఎంసీలోని వేర్వేరు విభాగాల అధికారులను అడిగేందుకు కార్పొరేటర్ల నుంచి 410 ప్రశ్నలు అందాయి. వాటిలో 24 ప్రశ్నలకే సర్వసభ్య సమావేశంలో చర్చించేందుకు అధికారులు ఎంపిక చేశారు.
ఇవీ చూడండి: