GHMC Council Meeting : హైదరాబాద్ మహానగర పాలక మండలి సర్వసభ్య సమావేశంలో వాదోపవాదాలు, వాయిదాలు కొనసాగాయి. తెలంగాణ సాయుధ పోరాటయోధులకు సభ తొలుత నివాళులర్పించింది. నాలా విస్తరణ పనుల్లో జాప్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సభ్యులు తెలిపారు. బంజారాభవన్, కుమురం భీం భవన్ నిర్మాణాలపై తెరాస కార్పొరేటర్ CMకు కృతజ్ఞతలు తెలపడంపై భాజపా కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
సభను భజన కార్యక్రమంగా మారుస్తున్నారని ఆందోళన చేశారు. తెరాసలో చేరిన కార్పొరేటర్ల అంశంపై భాజపా సభ్యులు పొడియాన్ని చుట్టుముట్టారు. తెరాస సిద్ధాంతాలు నచ్చే చేరారని తెరాస కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ తెలిపారు. దీనిపై భాజపా అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభ వాయిదా పడింది.
GHMC Council Meeting Today : ప్రభుత్వ భవనాలకు పన్నులు ఎందుకు వసూలు చేయడంలేదని భాజపా సభ్యులు ప్రశ్నించారు. ఎల్బీనగర్ నుంచి 284 కోట్లు, చార్మినార్ జోన్ నుంచి 102కోట్లు మాత్రమే వసూలు చేశారని తెలిపారు. పన్నులు ఎక్కువ వసూలైన ప్రాంతాలకు ఎక్కువ నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రులు, పాఠశాలలు, పోలీసు స్టేషన్‌లకు సంబంధించి 1996 నుంచి 3వేల కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని కమిషనర్ లోకేశ్‌కుమార్ తెలిపారు.
హోర్డింగ్స్, బ్యానర్ల విషయంలో వాడివేడి చర్చ జరిగింది. టూ- లెట్ బోర్డులకు అక్రమంగా చలానలు వేస్తున్నారని భాజపా, ఎంఐఎం కార్పొరేటర్లు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేకుండా పెట్టిన పోస్టర్లు, బ్యానర్లకే జరిమానా విధిస్తున్నామని ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజీత్ సమాధానం ఇచ్చారు.
రూబీ హోటల్ అగ్రి ప్రమాదం చర్చ సందర్భంగా మూడు అంతస్థులకు అనుమతిస్తే ఐదు అంతస్థులు కడితే అధికారులు ఏం చేశారని భాజపా కార్పొరేటర్లు ప్రశ్నించారు. 15మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న వాణిజ్య భవనాలకు అగ్నిమాపక శాఖ ఎన్‌ఓసీ అవసరంలేదని అధికారులు తెలిపారు. ఐతే ఇలాంటి భవనాల్లోనే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని తెలిపారు. దీనిని నివారించేందుకు కొత్త మార్గదర్శకాల కోసం అగ్నిమాపక అధికారులతో చర్చిస్తున్నామని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి..