నాలాల విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోని జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులపై కమిషనర్ లోకేశ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలా పనులను నిర్లక్ష్యం చేసిన 38 మంది ఇంజినీర్లకు చెందిన ఒకరోజు వేతనం కోత విధిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమాదకర నాలాలను గుర్తించి.. రక్షణ చర్యలు చేపట్టాలని గతంలో కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలే నాలాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్.. పనుల్లో నిర్లక్ష్యం చేసినందుకు గానూ 38 మందిపై చర్యలు చేపట్టినట్లు వివరించారు.
అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణిస్తామన్న కమిషనర్ నాలాల వద్ద జాగ్రత్తలు తీసుకోని వారిపై.. క్రిమినల్ కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో అవకతవకలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవన్న లోకేశ్‌కుమార్.. ఎలాంటి నోటీసు లేకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.