భవన నిర్మాణ అనుమతుల రుసుం వాయిదా రూపంలో చెల్లించే పద్ధతిని జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. స్థిరాస్తిపై మహమ్మారి ప్రభావం తగ్గించేందుకు ప్రభుత్వం జులై 2020లో ఈ వాయిదాల పద్ధతికి అనుమతిచ్చింది. మార్చి 31, 2021 వరకు ఈ పద్ధతిని అమలు చేయనున్నట్లు అప్పట్లో సర్కారు ప్రకటించింది. ఈ వాయిదా పద్ధతి ద్వారా స్థిరాస్తి రంగం పుంజుకుందని... మొత్తంగా 2020-21లో భవన నిర్మాణ అనుమతుల ద్వారా రూ. 797.13 కోట్ల ఆదాయం వచ్చిందని జీహెచ్ఎంసీ పేర్కొంది.
మొత్తం 11538 భవన నిర్మాణ అనుమతులు ఇచ్చినట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. ఇందులో 67 ఆకాశహర్మ్యాలు ఉన్నాయని తెలిపింది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే 2020-21లో కరోనా మహమ్మారి వల్ల భవన నిర్మాణ అనుమతులు తగ్గిపోయాయని జీహెచ్ఎంసీ తెలిపింది. గత సంవత్సరం లాక్డౌన్, తదనంతరం కార్మికుల లభ్యత తగ్గిపోవటమే దీనికి కారణమని ప్రకటించింది.
ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా రేపు వ్యాక్సినేషన్ నిలిపివేత