వర్షకాలంలో చేపట్టాల్సిన రక్షణ చర్యలపై జీహెచ్ఎంసీ (Ghmc) దృష్టి సాధించింది. వరదలు, భారీ వర్షాల సమయంలో చేపట్టాల్సిన విపత్తు నిర్వహణ (Disater Managment)కు కార్యచరణను రూపొందించింది. ఇంజినీరింగ్ విభాగం, విపత్తు స్పందన దళానికి స్పష్టమైన ఆదేశాలను అధికారులు జారీ చేశారు. గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల్లో 114 వాహనాలతో 78 మొబైల్ ఎమర్జెన్సీ బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు.
రూ. 32.90 కోట్లు...
ఈ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు చేపట్టనున్నారు. జీహెచ్ఎంసీ (Ghmc) పరిధిలోని ఎల్బీనగర్, చార్మినార్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, సికింద్రాబాద్ జోన్‌లకు రూ. 32.90 కోట్లు కేటాయించారు.
రంగంలోకి ప్రత్యేక బృందాలు...
నగరంలో 198 ప్రాంతాల్లో అత్యధికంగా నీరు నిలుస్తున్నట్లు బల్దియా అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో దాదాపు 2వేల మందితో 18 స్టాటిక్ బృందాలను ఏర్పాటు చేశారు. 24 గంటలపాటు మూడు విడతల్లో సిబ్బంది అక్కడ అందుబాటులో ఉంటారు. మ్యాన్‌హోల్ మూతల వద్ద పేరుకుపోయే వ్యర్థాలను తొలగించి, కాలువల్లో వరద నీరు వెళ్లేలా చర్యలు తీసుకుంటారు.
డివిజన్ స్థాయిలో సహాయ ఇంజినీర్లను నియమించారు. ఈదురు గాలులకు చెట్లు విరిగిపడినా, కాలనీలు నీటమునిగితే స్థానికులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రక్షణ బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 30 జేసీబీలు, 24 వాహనాలు రంగంలోకి దిగాయి.
ఇదీ చూడండి: Eatala: వారం రోజుల్లో దిల్లీ వెళ్లి భాజపాలో చేరుతా: ఈటల