ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకై 3 కి.మీ మేర వ్యాపించింది. దీంతో చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
అపస్మారక స్థితిలో రహదారిపై పడిపోయిన కొందరిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ప్రజలు భయాందోళనలతో తలుపులు వేసుకొని ఇళ్లలోనే ఉండిపోయారు. సైరన్‌లు మోగించి ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
పరిశ్రమకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాల ప్రజలను ఇళ్ల నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. 25 అంబులెన్స్‌లు, పోలీసు వాహనాల ద్వారా అస్వస్థతకు గురైన వారిని విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తున్నారు. సింహాచలం డిపోనుంచి ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చి పరిశ్రమకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న వారిని తరలిస్తున్నారు.
మహిళలు, చిన్నారులే ఎక్కువ...
అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నారు. జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్.కె.మీనా, ఎమ్మెల్యే గణబాబు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
పోలీసులు, రెవెన్యూ అధికారులు, వైద్య సిబ్బంది ఆర్.ఆర్. వెంకటాపురం ప్రాంతానికి చేరుకుని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకైనట్టు అధికారులు గుర్తించారు. లీకేజీని అరికట్టేందుకు అధికారులు, సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఇవీచూడండి: కేసీఆర్ చత్తీస్‌గఢ్,రాజస్థాన్ వస్తారా? : ఉత్తమ్ సవాల్