Gangula kamalakar on BC degree gurukulas : రాష్ట్రంలో మరో 17 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలలు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కళాశాలలు మంజూరు చేస్తూ బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జోగులాంబ గద్వాల, నారాయణ్‌పేట్, నాగర్ కర్నూల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, అదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కొత్త కళాశాలలు ప్రారంభం కానున్నాయి.
దీంతో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ బీసీ గురుకుల డిగ్రీ కళాశాల అందుబాటులోకి రానుంది. కొత్త కళాశాలలు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ కృతజ్ఞతలు తెలిపారు. వెనకబడిన వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం కేసీఆర్ సర్కార్ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. తాజాగా ఏర్పాటయ్యే కళాశాలలతో కేవలం బీసీ డిగ్రీ గురుకులాల్లోనే 31,680 మందికి ప్రపంచస్థాయి విద్య అందుతుందని మంత్రి తెలిపారు.
శాసనసభ్యుల చేతుల మీదుగా ఆర్థికసాయం.. బీసీ వృత్తులకు లక్ష రూపాయల ఆర్థికసాయం కోసం 5,28,862 దరఖాస్తులు వచ్చినట్లు మంత్రి గంగుల చెప్పారు. అందులో బీసీ-ఏ కేటగిరీ నుంచి 2,66,001, బీసీ-బీ నుంచి 1,85,136, బీసీ-డీ నుంచి 65,310 దరఖాస్తులతో పాటు ఎంబీసీలు 12,415 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఈ దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభమైందని తెలిపారు. క్రమ సంఖ్య ప్రకారం ప్రక్రియ జరుగుతుందన్నారు. ప్రతి నెలా 5వ తేదీ వరకు పరిశీలన పూర్తయిన వారికి అదే నెల 15వ తేదీన స్థానిక శాసనసభ్యుల చేతుల మీదుగా ఆర్థికసాయం అందిస్తామని మంత్రి గంగుల కమలాకర్ వివరించారు.
మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి : రూ.లక్ష ఆర్థిక సహాయం అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం గురువారం మార్గదర్శకాలు జారీచేసింది. ఎంపిక చేసిన లబ్ధిదారులకు వరుస క్రమం(సీరియల్ నంబరు) ఆధారంగా సాయం పంపిణీ జరుగుతుందని స్పష్టం చేసింది. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆమోదంతో అన్ని జిల్లాల కలెక్టర్లు ప్రతి నెలా వరుస క్రమంలో ఎంపిక జాబితాలు సిద్ధంచేసి, ఆ వివరాలు వెబ్‌సైట్‌తోపాటు మండల స్థాయి కార్యాలయాలు, గ్రామ పంచాయతీలలో అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. మండల స్థాయిలో దరఖాస్తుల పరిశీలన ఈ నెల 26 నాటికి పూర్తిచేసి అర్హుల జాబితాను సంబంధిత జిల్లా బీసీ సంక్షేమాధికారులకు పంపించాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చింది. అర్హులను ఎంపికచేసే సమయంలో అత్యంత పేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, అత్యంత వెనుకబడిన వర్గాలు (ఎంబీసీ)లకు ప్రాధాన్యమివ్వాలని సూచించింది.
లబ్దిపొందే కులాల జాబితా .. బీసీలకు లక్ష రూపాయలు పథకం కింద 1. నాయూ బ్రాహ్మణులు, 2. రజక, 3. సరగ లేదా ఉప్పర, 4. కుమ్మరి లేదా శాలివాహన, 5. గోల్డ్‌స్మిత్, 6. కంసాలి, 7. వడ్రంగి, శిల్పులు, 8. వడ్డెర, 9. కమ్మరి, 10. కంచరి, 11. మేదర, 12. కృష్ణ బలిజ పూసల, 13. మేర (టైలర్స్), 14. అరె కటిక, 15. ఎంబీసీ కులాలు ఉన్నాయి. 36 కులాలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చింది. వీరిలో దాసరి, దొమ్మర, జంగం, పాములు, పర్తి, పెద్దమ్మవండ్లు, వీరముష్టి, గుడల, కంజర, రెడ్డిక, మందుల, బుక్క అయ్యవారు, రాజన్న వంటి కులాలు ఉన్నాయి.
ఇవీ చదవండి: