Ganesh Immersion in Hyderabad: భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జనం సందడే వేరు. ఈసారి అత్యంత వైభవంగా వినాయక నిమజ్జన మహోత్సవం జరుగుతోంది. హుస్సేన్‌సాగర్, సరూర్‌నగర్ సహా పలుచోట్ల గణేశ్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా హుస్సేన్‌సాగర్ ప్రాంతం ప్రజలతో కిటకిటలాడుతోంది. నిమజ్జనాల కోసం రహదారులపై గణనాథులు బారులు తీరాయి. గణనాథుడికి వీడ్కోలు పలికేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
గణేశ్ శోభాయాత్ర మార్గాలు భక్తులతో కిటకిటలాడాయి. వినాయక నిమజ్జన శోభాయాత్ర.. సిటీ పరిధిలో దాదాపు 354 కిలోమీటర్ల మేర సాగుతోంది. ప్రధాన శోభాయాత్ర బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ తీరం వరకు 18 కిలోమీటర్ల మేర జరుగుతోంది. భక్తుల కోలాహలం మధ్య కనుల పండువగా గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. భక్తుల నృత్యాలు, డప్పు వాయిద్యాల మధ్య గణనాథులు ముందుకు కదులుతున్నారు. నగరం నలుమూలల నుంచి వచ్చిన భక్తుల గణపతి నామస్మరణతో హుస్సేన్‌సాగర్ పరిసరాలు మారుమోగుతున్నాయి.
ఎక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 12 వేల మంది పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. పాతబస్తీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరిస్తున్నారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీం, టాస్క్‌ఫోర్స్ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. శోభాయాత్ర కొనసాగే ప్రధాన మార్గాల్లోని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు 24 గంటల పాటు.. కమాండ్ కంట్రోల్ నుంచి నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షించనున్నారు.
ఇవీ చూడండి..
బైబై గణేశా.. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణపతి
ఆరు నెలల చిన్నారికి పూజలు.. దర్శనం కోసం వందలాది మంది క్యూ.. ఆ మచ్చలే కారణం