G20 Agriculture Ministers Meeting in Hyderabad : హైదరాబాద్ హెచ్ఐసీసీలో ప్రతిష్ఠాత్మక జీ-20 సభ్య దేశాల వ్యవసాయ శాఖ మంత్రుల సదస్సు ప్రారంభమైంది. మూడ్రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును కేంద్ర వ్యవసాయ సహాయ మంత్రి కైలాష్‌చౌదరి గురువారం రోజున లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో జీ-20 సభ్య దేశాల వ్యవసాయ మంత్రులు, అంతర్జాతీయ పరిశోధన సంస్థల అధిపతులు, శాస్త్రవేత్తలు, నిపుణులు 250 మంది వరకు ప్రతినిధులు పాల్గొన్నారు. తొలిరోజు సదస్సుకు ముఖ్య అతిథిగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ హాజరయ్యారు. వ్యవసాయంలో డిజిటల్ సాంకేతికతలు, వ్యవసాయ వాణిజ్య నిర్వహణపై కార్యాచరణ బృంద సమావేశం జరిగింది. వ్యవసాయ వాణిజ్యంలో లాభాలు, ప్రజోపయోగాల అంశంపై చర్చాగోష్ఠి జరిగింది.
Narendra Singh Tomar on G20 Agriculture Meeting : సుస్థిర వ్యవసాయం ద్వారా అధిక పంట ఉత్పత్తుల సాధనకు భారత ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. విభిన్న పంటల సాగును ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. పెరుగుతున్న జనాభా దృష్ట్యా ఆహారభద్రత, పౌష్టికాహార పంపిణీకి ప్రాధాన్యం పెరిగిందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో తొమ్మిదేళ్లలో వ్యవసాయ రంగంలో భారత్ సుసంపన్నంగా, శక్తిమంతంగా మారిందన్న ఆయన... ప్రత్యేకంగా చిన్న, సన్నకారు రైతులను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి సేంద్రియ, సహజ పంటల ఉత్పత్తుల సాగును ప్రోత్సహిస్తున్నామని వివరించారు.
'వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయరంగంలో సవాళ్లపై చర్చిస్తున్నాం. వ్యవసాయం రంగంలోని సవాళ్లకు పరిష్కారాలపై చర్చిస్తున్నాం. ఆహార భద్రత, పోషకాహార భద్రతపై చర్చిస్తున్నాం. వ్యవసాయం, ఉద్యాన పంటల ఉత్పాదకత పెంపుపై చర్చలు జరుపుతున్నాం. రైతుల ఆదాయం పెంచేందుకు కేంద్రం కృషి చేస్తోంది. దేశంలో సేంద్రీయ, సహజ వ్యవసాయం ప్రోత్సహిస్తున్నాం.'- నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి
ప్రధాని మోదీ నేతృత్వంలో అన్నదాతల ఆదాయాలు పెంచేందుకు కేంద్రం కృషి చేస్తోందని నరేంద్ర సింగ్ తోమర్ వివరించారు. ప్రత్యేకంగా చిన్న, సన్నకారు రైతుల బలోపేతం కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో సేంద్రీయ, సహజ వ్యవసాయం ప్రోత్సహిస్తున్నామని.. సేంద్రీయ రైతులు తమ ఉత్పత్తులు అమ్ముకోవడానికి మార్కెటింగ్ లింకేజీ కల్పించినట్లు నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. జీ-20 సమావేశాలకు విదేశీ ప్రతినిధులు, అంతర్జాతీయ సంస్థల నుంచి మంచి స్పందన వస్తోందని తోమర్ పేర్కొన్నారు.
ముగింపు రోజున రోడ్ మ్యాప్ : రెండో రోజు ఆహార భద్రత, పోషకాహారం తదితర అంశాలపై చర్చ జరుగనుందని... మూడో రోజు ముగింపు సందర్భంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రకటనతో పాటు రోడ్ మ్యాప్‌ను విడుదల చేస్తామని చెప్పారు. కాగా... వ్యవసాయ మంత్రుల సమావేశం సందర్భంగా 71 స్టాళ్లతో కూడిన వ్యవసాయ పరికరాలు, పరిశోధన, అభివృద్ధి ప్రదర్శనను మంత్రి కైలాష్ చౌదరి ప్రారంభించారు.
ఇవీ చదవండి :