Fuel Prices Effect: చమురు ధర చుక్కల దిశగా పరుగుతీస్తోంది.. అన్ని రంగాలకు ఇంధన భారం ఇరకాటంగా మారింది... నిత్యం మారిపోతున్న రేట్లు బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్పాదక, రవాణా అవసరాలకు విరివిగా వినియోగించే డీజిల్ ప్రభావం అనేక ఉత్పత్తులపై పడుతోంది. వ్యవసాయ రంగాన్నే చూస్తే.. దమ్ములు చేయడానికి ట్రాక్టర్ కిరాయి మొదలు... పండిన పంటను రవాణా చేయడం వరకు అన్ని దశల్లోనూ అన్నదాతకు భారీగా చేతిచమురు వదులుతోంది. సంచి లాభం చిల్లి తీసిందన్నట్లు.. పెరిగిన ఖర్చులు రైతుకు వచ్చే అరకొర రాబడికీ గండి కొడుతున్నాయి. రాష్ట్రంలో అనేక పరిశ్రమలకు ముడి సరకైన పాలిమర్స్ పెట్రో ఉప ఉత్పత్తుల కిందకే వస్తాయి. వీటి ధరలు కూడా అమాంతం రెట్టింపై.. పరిశ్రమలు మూతపడే స్థాయిలో భయపెడుతున్నాయి. ప్లాస్టిక్, ఇంజినీరింగ్, సిమెంటు, వైద్య, ఆరోగ్య ఉత్పత్తులు, పరికరాల తయారీకి పాలిమర్స్ ధరలు అశనిపాతంగా మారాయి. చమురు ధరలు భగ్గుమంటుండడంతో ఆటోలు, క్యాబ్ డ్రైవర్ల జీవనం దయనీయంగా మారింది. కరోనా కొట్టిన దెబ్బకు ఇంకా కోలుకోలేకపోయిన వారు ఇప్పుడు తమ వాహనాలను తెగనమ్ముకుని.. కూలీనాలీ పనులకు మళ్లిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
సాగు తడిసి మోపెడు
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సమీపంలో వరికోత కోస్తున్న యంత్రమిది. గంటసేపు వరికోత కోయడానికి రెండేళ్ల క్రితం రూ.1800 నుంచి రూ. 2400 తీసుకునేవారు. ఇప్పుడు రూ.2500 నుంచి రూ. 3500 దాకా వసూలు చేస్తున్నారు.
చిన్న పరిశ్రమ కుదేలు: హైదరాబాద్‌లోని షాపూర్‌నగర్‌కు చెందిన శ్రీనివాస్ ఇరవైఏళ్ల కిందట చిన్నతరహా పరిశ్రమను స్థాపించి స్వయం ఉపాధి పొందుతున్నారు. ప్లాస్టిక్ ఉత్పత్తులను తయారు చేసి విద్యుత్ సంస్థలకు విక్రయిస్తున్నారు. పాలిమర్ ఇతర ముడిసరకుల ధరలు పెరగడంతో ఆయన పరిస్థితి దయనీయంగా మారింది. గత నెల రోజుల్లోనే దాదాపు 40 శాతం మేర ధరలు పెరగడంతో ఆదాయం తగ్గింది. కార్మికులకు వేతనాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో పరిశ్రమ మూసివేతే శరణ్యమని వాపోతున్నారాయన.
యజమాని డ్రైవరయ్యాడు: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌కి చెందిన రవీంద్రనాయక్ తన దగ్గరున్న రెండు వాహనాలను కిరాయికి తిప్పేవారు. ఇప్పుడు ఆదాయం చాలక నష్టాలొస్తుండడంతో వాటిని అమ్మేసి తాత్కాలిక డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ‘వచ్చే ఆదాయం ఖర్చులకే పోతుండటంతో ఆటో వదిలేసి సొంత ఊరు వెళ్లిపోయా’ అని సిద్దిపేట జిల్లా కొమురవెల్లికి చెందిన భిక్షపతి చెప్పారు. ‘ఊరి నుంచి హైదరాబాద్ వచ్చి కారు నడిపా. ఇప్పుడు దాన్ని అమ్మేసి డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నా’నని సంగారెడ్డి జిల్లా కోడూరుకు చెందిన నర్సింహ తెలిపారు.
పరిశ్రమలపై పిడుగుపాటు.. ఇంధన ధరల పెరుగుదల పారిశ్రామిక రంగంపై పిడుగుపాటుగా మారింది. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలతో రవాణా ఛార్జీలు పైకి ఎగబాకుతుండగా, పరిశ్రమల్లో ముడిపదార్థంగా భారీ స్థాయిలో వినియోగించే పెట్రో ఉప ఉత్పత్తి పాలిమర్ ధరలు రెట్టింపయ్యాయి. దీంతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడే ప్రమాదం నెలకొంది. వ్యవసాయం, వాహనాల తయారీ, ఆహారశుద్ధి, సిమెంటు, ఆరోగ్య సంరక్షణ, ఔషధ, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్, గృహోపకరణాలు, ప్యాకేజింగ్ తదితర పరిశ్రమలకు పాలిమర్స్ తప్పనిసరి. దీన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని చమురు కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. పెట్రోలు, డీజిలు ధరల కంటే పాలిమర్స్ ధరలు మరింతగా భగ్గుమంటున్నాయి. ఫలితంగా ఆయా ఉత్పత్తుల ధరలు పెరిగి, వినియోగదారులపైనా భారం పడుతోంది. తెలంగాణలో 18,302 ఇంజినీరింగు, 12,023 ప్లాస్టిక్ పరిశ్రమలున్నాయి. వీటితో పాటు ఇంధన ఉత్పత్తులపై ఆధారపడి మరో పదివేల ఇతర పరిశ్రమలు నడుస్తున్నాయి. వీటిలో మూడున్నర లక్షల మంది పనిచేస్తున్నారు. పాలిథిన్ సంచులు, గ్లాస్‌లు, పైపులు సహా ఆరున్నర వేలకు పైగా వస్తువులు, పరికరాలు తయారవుతున్నాయి. ఉత్పాదక వ్యయం పెరిగేకొద్దీ వస్తు, ఉత్పత్తుల ధరలూ పెరిగి ఆ ప్రభావం వినియోగదారులపైనే పడుతోంది.
ప్రధాన రంగాలకు దెబ్బ: ఏబీఎస్ రకం పాలిమర్ కిలో ధర 2015లో రూ. 144 ఉండగా... ప్రస్తుతం రూ. 340కి ఎగబాకింది. ఈ ధర నెలనెలా పెరుగుతూనే ఉంది. పీవీసీ, సీపీ, హెచ్‌డీపీఈ, ఎల్‌ఎల్‌డీపీఈ, పీపీ, జీపీపీఎస్, హెచ్‌పీపీఎస్, పీపీసీపీ, ఎల్‌డీపీఈ, పీఈటీ తదితర 11 రకాల పాలిమర్ ధరలు 50-80 శాతం వరకు పెరిగాయి. వైద్య ఆరోగ్యం, ఔషధ రంగాల్లో పాలిమర్ ధరాభారం వల్ల ఉత్పత్తులు తగ్గిపోయాయి. వ్యవసాయరంగానికి అవసరమైన పైపులు, ఇతర పరికరాల ఉత్పత్తి మందగించింది. బొమ్మల తయారీ దాదాపుగా నిలిచిపోయింది. చాలా పరిశ్రమల్లో ఉత్పత్తులు 50 శాతమే జరుగుతున్నాయి. ఫలితంగా ఇతర రాష్ట్రాలకు జరిగే ఎగుమతులు తగ్గాయి. రవాణా ఛార్జీలు గతంలో టన్నుకు రూ. 5-10 వేల వరకు ఉండేవి. చమురు ధరలకు అనుగుణంగా ఇప్పుడు వాటిని ఏకంగా రూ.10-15 వేలకు పెంచారు.
పారిశ్రామికవేత్తలపై భారం.. ఇంధన, వాటి అనుబంధ సరకుల ధరల్లో భారీ పెరుగుదలతో పారిశ్రామికవేత్తలు కోలుకోలేని విధంగా నష్టపోతున్నారు. ఉత్పత్తులు సరిగా రాక మార్కెట్లో విక్రయాలు తగ్గిపోయాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. ప్రధానంగా భారత్‌లో సమస్య దృష్ట్యా ఎగుమతులను నిలిపివేసి దేశీయ పరిశ్రమలకు చేయూతనివ్వాలి. ముడిసరకుల ధరల నియంత్రణకు పెట్రోలియం ఉత్పత్తుల నియంత్రణ ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయాలి. - సుధీర్‌రెడ్డి, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య
కనీవినీ ఎరుగని పెరుగుదల .. గత ఇరవైయేళ్లుగా పరిశ్రమలో ఉన్నాను. ధరల పెరుగుదల ఇంత భారీగా ఎప్పుడూ లేదు. ముడిసరకు కొనాలంటేనే భయమేస్తోంది. ప్రతి వస్తువు ఉత్పత్తి వ్యయం పెరగడం మాకు నష్టదాయంగా మారింది. దీనికి తోడు జీఎస్టీ కూడా సమస్యాత్మకమవుతోంది. కరోనా నుంచి కోలుకునేలోగానే, పెట్రోలియం సంస్థలు ధరలను అమాంతం పెంచేశాయి. - సీహెచ్ కామేశ్వర్‌రావు, భవిక ప్లాస్టిక్స్, రాంపల్లి, మేడ్చల్
చక్రధారికి చమురుదెబ్బ: కరోనా మహమ్మారి దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన ఆటోవాలాలు, క్యాబ్‌డ్రైవర్లను భారీగా పెరుగుతున్న చమురుధరలు మరింత కుంగదీస్తున్నాయి. వాహనాల అద్దెలు, సొంతవైతే రుణభారాలు, నిర్వహణ వీటన్నిటికీ తోడు నిత్యం పెరిగే ఇంధన, నిత్యావసరాల ధరలు వారి జీవితాలను భారంగా మార్చేస్తున్నాయి. కొందరు వాహనాలు అమ్మేసుకుని ఇతర వృత్తుల్లోకి వెళుతున్నారు. మరికొందరు ఇతరుల వద్ద డ్రైవర్లుగా, డెలివరీ బాయ్‌లుగా మారిపోతున్నారు. వేరే పనులు అలవాటు లేనివారు ఈ వృత్తిలో కొనసాగలేక, పూట గడవక అల్లాడిపోతున్నారు.
వినియోగదారులతో తప్పని ఘర్షణలు.. ప్రయాణ సమయంలో క్య్ఘాబ్‌లో ఏసీ వేస్తే ఇంధన ఖర్చు పెరుగుతుందని డ్రైవర్లు లబోదిబోమంటున్నారు. వేయకపోతే వినియోగదారులు ఒప్పుకోవట్లేదు. దీంతో డ్రైవర్లు కి.మీ.కి రూ.3 అదనంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ఇరువర్గాలకు గొడవలు జరుగుతున్నాయి. యాప్‌లలో క్యాబ్ బుక్ చేసినా, ఆ ఛార్జీ తమకు గిట్టుబాటు కాదని, అదనపు మొత్తం ఇస్తేనే వస్తామని కొందరు డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ట్రిప్ క్యాన్సిల్ చేసేస్తున్నారు. ఇలాంటి క్యాన్సిలేషన్లు ఇటీవల గణనీయంగా పెరిగాయని క్యాబ్ యజమానుల సంఘం వర్గాలు తెలిపాయి.
వాయిదాలు చెల్లించడం కష్టంగా మారింది.. కుటుంబ పోషణకు అప్పు చేసి ఆటో కొనుక్కొని నడుపుతున్నా. గతంలో డీజిల్ ఖర్చులన్నీ తీసేశాక రోజుకు రూ.600 సంపాదించేవాడిని. ఇప్పుడు రూ.300 రావడమే గగనమవుతోంది. గత ఏడాది లాక్‌డౌన్ వల్ల బండి రుణం వాయిదాల్ని ఇప్పటికీ చెల్లించకపోయాను. ఇంట్లో పూట గడవడం కష్టంగా మారింది. - కృష్ణ, ఆటోడ్రైవర్ నారాయణపేట
అంతా భారమే.. క్యాబ్‌లు నడిపేవారికి కరోనాకు ముందు నెలకు డీజిల్ ఖర్చు రూ.30 వేలయ్యేది. ఇప్పుడు రూ. 40-45 వేలవుతోంది. రూ.వెయ్యితో డీజిల్ పోస్తే 250-300 కిమీ దూరం వచ్చేది. ఇప్పుడు 200 కిలోమీటర్లే వస్తోంది. ఇలా ఖర్చు పెరిగి, ఆదాయం తగ్గిపోతోంది. అయిదారేళ్లక్రితం హైదరాబాద్‌లో లక్ష వరకు క్యాబ్‌లుండేవి. ఇప్పుడు సుమారు 15 వేలు మాత్రమే ఉంటాయి. - ఉల్కుందార్ శివ, తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు, యజమానుల సంఘం అధ్యక్షుడు
రైతుకు ఖర్చుల ఉచ్చు.. పెట్రోలు డీజిల్ ధరల పెరుగుదల వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇంధన ధరలు రోజూ పెరుగుతుండడంతో జూన్‌లో ప్రారంభమయ్యే కొత్త వానాకాలం (ఖరీఫ్) సీజన్ నాటికి సాగువ్యయం మరింత అధికమవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నడానికి గతంలో గంటకు కిరాయి రూ.650 తీసుకునేవారు. ఇప్పుడు రూ. 800కి పెంచారు. రోటవేటర్‌కు రూ.900 నుంచి రూ. 1500కి, సెనగ కోత యంత్రానికి క్వింటాలుకు రూ. 200 నుంచి రూ.300కి పెంచారు. కూలీలను పొలాలకు తరలించడానికి ఆటో కిరాయిలు రైతులే భరించాలి. ఈ ఖర్చు 30 నుంచి 40 శాతం పెరిగింది. ప్రస్తుతం రైతులు యాసంగి పంటలను కోసి మార్కెట్లకు తెస్తున్నారు. ధాన్యాన్ని తొలుత పొలం నుంచి మార్కెట్లకు, అక్కడి నుంచి రైసుమిల్లులకు రైతులే తరలించాల్సి వస్తోంది. ఈ కిరాయిలు భారీగా పెరగడంతో ఖర్చులు తడిసిమోపెడై.. పంటపై వచ్చే కొద్దిపాటి రాబడీ హరించుకుపోతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి కోతలకు అత్యధిక శాతం రైతులు యంత్రాలనే వాడుతుండడంతో పెరిగిన కిరాయిలు వారికి భారంగా మారాయి.
వ్యవసాయం కష్టమే.. విత్తనాలు వేసే ముందు దుక్కులకు ట్రాక్టర్ల కిరాయి దగ్గర నుంచి కూలీల తరలింపు, పంటకోత, రవాణా...ఇలా అన్ని పనులకు ఖర్చులు పెరిగాయి. పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతే ఇక వ్యవసాయం చేయడం మాలాంటి సామాన్య రైతులకు సాధ్యమే కాదు. - పి.అశోక్, రైతు, తాంసి గ్రామం, ఆదిలాబాద్ జిల్లా
ఎకరా సాగుకు రూ.3 వేల అదనపు ఖర్చు.. వ్యవసాయంలో ఎకరానికి అదనంగా కిరాయిలు, ఇతర ఖర్చులు రూ.3 వేల వరకూ పెరిగాయి. పంటపై వచ్చే లాభం పెద్దగా లేకున్నా రోజూ పెరిగే డీజిల్, పెట్రోలు ధరలతో మాపై మరింత భారం పడుతోంది. వ్యవసాయానికి వాడే డీజిల్‌పై ప్రభుత్వం రాయితీ భరించి తక్కువకు ఇవ్వాలి. - ఒంటెల వెంకటరమణారెడ్డి, రైతు, శ్రీరాములపల్లి, రామడుగు మండలం, కరీంనగర్ జిల్లా
ఇదీ చదవండి: ధాన్యం కొనుగోలుపై రాజకీయవేడి.. నేతల మధ్య ఆగని మాటల యుద్ధం..