విద్యుత్ కొనుగోలు, సరఫరా, పంపిణీ వ్యయం ఎక్కువ చూపుతూ డిస్కంలు కరెంటు ఛార్జీల రూపంలో వినియోగదారులపై భారం మోపాలని చూస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) ఈఆర్‌సీకి ఫిర్యాదు చేసింది. వివరణగా పలు గణాంకాలను సైతం జోడించింది. ఇంకా పలు సంస్థల వారు, వ్యక్తులు కూడా డిస్కంల కరెంటు ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై అభ్యంతరాలు తెలిపారు. ఈ నెల 18 నుంచి నెలాఖరు వరకు రాష్ట్రంలో నాలుగు చోట్ల ఈఆర్సీ ఇలాంటి ఫిర్యాదులపై బహిరంగ విచారణ నిర్వహించి తుది తీర్పు వెలువరిస్తుంది.
ముఖ్యాంశాలు..
వచ్చే ఏడాది 2022-23లో కరెంటు కొనేందుకు రూ.39,415.08 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని డిస్కంలు పేర్కొనగా రూ.34,974.49 కోట్లకు మించి కాదని ఎఫ్‌టీసీసీఐ వివరించింది. కరెంటు పంపిణీ, సరఫరా, డిస్పాచ్ వ్యవస్థకు పెట్టే వ్యయం కూడా ఎక్కువ చేసి చూపించారని తెలిపింది. ‘‘వచ్చే ఏడాదికి నికరంగా రూ.52,991.04 కోట్లు కావాలని.. అంత వచ్చే అవకాశం లేనందున ఛార్జీలు పెంచాలని డిస్కంలు కోరాయి. కానీ నికర ఆదాయం రూ.44,328.31 కోట్లు వస్తే సరిపోతుంది’’ అని ఎఫ్‌టీసీసీఐ తెలియజేసింది.
పారిశ్రామిక అభివృద్ధిపై తీవ్ర ప్రభావం
‘‘విద్యుత్ చట్టం ప్రకారం రాష్ట్రంలో ఒక యూనిట్ కరెంటు సరఫరాకయ్యే సగటు వ్యయం(ఏసీఎస్) కంటే 20 శాతం ఎక్కువ లేదా తక్కువ ఛార్జీని వినియోగదారుల నుంచి వసూలు చేయకూడదు. తెలంగాణలో ప్రస్తుత ఛార్జీల ప్రకారం హైటెన్షన్(హెచ్‌టీ)1-11కేవీ కనెక్షన్ ఉన్న వినియోగదారుల నుంచి ఏసీఎస్‌కన్నా 13 శాతం అదనంగా వసూలు చేస్తుండగా పెంపు ప్రతిపాదనల్లో ఈ శాతాన్ని 34కి పెంచాలని డిస్కంలు కోరాయి. ఇలాగే హెచ్‌టీ1-33కేవీకి 4 నుంచి 29 శాతానికి పెంచాలని ప్రతిపాదించాయి.
- ప్రభుత్వం ఎవరికైనా ఉచితంగా లేదా తక్కువ ఛార్జీలకు కరెంటు ఇస్తే పూర్తి ఛార్జీలను రాయితీ రూపంలో డిస్కంలకు చెల్లించాలి. కానీ అలా ఇవ్వకుండా ఆ భారాన్ని పరిశ్రమలపై మోపకూడదు. ఏసీఎస్ కంటే 20 శాతానికి మించి ‘క్రాస్‌సబ్సిడీ’ రూపంలో వసూలు చేయకూడదు.
- హెచ్‌టీ కనెక్షన్లతో కరెంటు వాడుకునే పరిశ్రమల నుంచి ప్రస్తుతం కిలోవాట్ యాంపియర్‌కు’(కేవీఏకి) రూ.375 చొప్పున స్థిరఛార్జీ(ఫిక్స్‌డ్‌ఛార్జీ) వసూలు చేస్తుంటే రూ.475కి పెంచాలని అధికారులు ప్రతిపాదించారు. ఇంత భారీగా పెంచితే పారిశ్రామిక అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుంది.
- డిస్కంల నుంచి కాకుండా బయట ఎక్కడైనా కరెంటు కొనాలనుకునేవారిపై వేస్తున్న అదనపు సర్‌ఛార్జీని ప్రస్తుతమున్న 54 నుంచి 96 పైసలకు పెంచాలని ప్రతిపాదించారు. ఇది కాకుండా నెలకు లెవీ ఛార్జీ కింద రూ.20 వేల చొప్పున వసూలు చేస్తామని మరో ప్రతిపాదన ఇవ్వడం మరింత భారం మోపుతుంది’’ అని ఎఫ్‌టీసీసీఐ తెలిపింది.
2022-23లో రావాల్సిన రాయితీ 13,217.37 కోట్లు
వివిధ వర్గాలకు ఉచితంగా లేదా తక్కువ ఛార్జీలకు కరెంటు సరఫరా చేస్తున్నందుకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీ ఎంత కావాలనేదానిపై డిస్కంలు సరైన వివరణ ఇవ్వలేదని ఎఫ్‌టీసీసీఐ ఈఆర్సీకి తెలియజేసింది. ఈ ఏడాది ఎంత రాయితీ ఇస్తే వచ్చే ఏడాది అంతే కావాలని మాత్రమే అడిగాయని వాస్తవానికి 2022-23లో ప్రభుత్వం 13,217.37 కోట్లు రాయితీగా డిస్కంలకు ఇవ్వాల్సి ఉందని వివరించింది.
‘‘హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ తెలంగాణ డిస్కం పరిధిలో ఒక యూనిట్ కరెంటు సరఫరా సగటు వ్యయం వ్యవసాయానికి, గృహాలకు రూ.6.07, ఉత్తర డిస్కంలో రూ.5.79 అవుతోంది. ఈ లెక్కన రాయితీ రూ.13,217.37 కోట్లు ఇవ్వాలి.
- వచ్చే ఏడాది గృహాల, హైటెన్షన్ విద్యుత్ వినియోగం 7 శాతం పెరుగుతుందని డిస్కంలు అంచనా వేసి ఆదాయాన్ని లెక్కగట్టాయి. కానీ తెలంగాణలో కరెంటు వినియోగ వృద్ధిరేటు 2021-27 మధ్యకాలంలో 4.42 శాతమే ఉండవచ్చని కేంద్ర విద్యుత్ మండలి(సీఈఏ) తెలిపింది.
- రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెరుగుతున్నా వినియోగం తగ్గుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఉదాహరణకు 2018-19లో దక్షిణ డిస్కంలో వ్యవసాయ కరెంటు వినియోగం 12,637.78 మిలియన్ యూనిట్లు(ఎంయూ) ఉంటే ప్రస్తుత ఏడాది(2021-22)లో 11,647.65 ఎంయూలుంది. ఉత్తర డిస్కంలో ఇదే కాలవ్యవధిలో 8,200 నుంచి 7,837 ఎంయూలకు తగ్గింది’’ అని ఎఫ్‌టీసీసీఐ వివరించింది.
ఇదీ చదవండి: