రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి 20వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేయనున్నారు. ఉచిత బియ్యం కోసం చౌక ధరల దుకాణాల వద్ద సందడి నెలకొంది. ఉదయం 6 గంటల నుంచే రేషన్ కార్డుదారులు దుకాణాల వద్ద లైన్లలో నిల్చున్నారు.
కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో ఒక్కొక్కరికీ ఇచ్చే 5 కిలోలతో పాటు అదనంగా మరో 10 కిలోలు కలిపి మొత్తం 15 కిలోల చొప్పున అందిస్తున్నారు. సాధారణ రాయితీ ధరపై కిలో పంచదార, జీహెచ్ఎంసీలో 2 కిలోల గోధుమలు, పురపాలిక సంస్థల్లో 1 కిలో గోధుమలు పంపిణీ చేస్తున్నారు.
జులై మాసంలోనూ ఇదే మాదిరిగా ఉచిత బియ్యం ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,500 చౌక ధరల దుకాణాల ద్వారా 87.54 లక్షల కుటుంబాలకు 4 లక్షల 4 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది.
ఇదీ చూడండి: WEATHER REPORT: ఎల్లుండిలోగా రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు