సెలూన్లు, లాండ్రీలు, దోబీ ఘాట్లకు ప్రభుత్వం తలపెట్టిన 250 యూనిట్ల ఉచిత కరెంట్ పథకంలోని నిబంధనలు సరళతరం చేయాలని నాయీబ్రాహ్మణ సంఘం కోరింది. మంత్రి గంగుల కమలాకర్ను హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఆ సంఘం ప్రతినిధులు కలిశారు. గత ఉత్తర్వుల్లో తమకు ఇబ్బందికరంగా ఉన్నవాటిని సరళీకరించాలని నాయిబ్రాహ్మణులు కోరారు. బలహీనవర్గాల ఇబ్బందుల్ని తొలగించడానికి కరోనా కష్టాలతో పాటు అన్నార్తుల ఆకలి తీర్చడానికి మంచి పథకానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వానికి కృతజ్ణతలు తెలియజేశారు.
గతంలో ఇచ్చిన జీవో 2లో లేబర్ లైసెన్స్ లేదా మున్సిపల్, గ్రామ పంచాయతీ లైసెన్సులు, రెంటల్ అగ్రిమెంట్, మూడు నెలల పవర్ బిల్లుల అడ్వాన్స్ చెల్లింపుల నుంచి మినహాయింపునివ్వాలని కోరారు. వ్యక్తిగత ధ్రువీకరణతో అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు 80శాతం నాయీబ్రాహ్మణులు కులవృత్తి ద్వారానే జీవనం కొనసాగిస్తున్నారని మంత్రికి వివరించారు.
ఇప్పటివరకూ రాష్ట్రంలోని సెలూన్లకు ఎలాంటి లైసెన్సులు అవసరం లేకుండా నడవడానికి అనుమతి ఉందని... ఈ పథకం కోసమే లైసెన్సులు తీసుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. తమ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని స్వీయ ధ్రువీకరణతో ఆమోదించాలని కోరారు. సెలూన్ల నిర్వాహకులు మూడునెలల సర్ ఛార్జి అడ్వాన్సులు చెల్లించే పరిస్థితుల్లో లేరని.. వీటిని తొలగించాలని కోరుతూ మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు. దీనిపై స్పందించిన మంత్రి... నాయీబ్రాహ్మణుల ఇబ్బందుల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు.
ఇదీ చదవండి: దూరమవుతున్న బంధాలు.. వెంటాడుతున్న భయాలు