Fourth Industrial Revolution in Telangana : స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న 54వ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. ఈ వేదిక ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్(సీ4ఐఆర్)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరింది. బయో ఏషియా-2024 సదస్సులో భాగంగా వచ్చే నెల(ఫిబ్రవరి) 28న ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో మంగళవారం (16న) వేదిక అధ్యక్షుడు బర్గె బ్రెండ్ ప్రతినిధి బృందంతో సీఎం రేవంత్‌రెడ్డి బృందం చర్చలు జరిపింది. అనంతరం ఈ విషయాన్ని సంయుక్తంగా వెల్లడించారు.
CM Revanth Reddy Davos Tour : జీవ వైద్య రంగంలో అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తెలంగాణలో నెలకొల్పనున్న ఈ కేంద్రానికి ప్రపంచ ఆర్థిక వేదిక(World Economic Forum) పరిపూర్ణ సహకారాన్ని అందించనున్నట్లు బర్గె బ్రెండ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ మెరుగుదలకు సాంకేతిక ఆధారిత కార్యక్రమం రూపకల్పనలో ఈ కేంద్రం ద్వారా మార్గం సుగమమైందని సీఎం రేవంత్ చెప్పారు. 'ప్రపంచ ఆర్థిక వేదిక విశాల దృక్పథం, నిర్దేశించుకున్న లక్ష్యాలన్నీ తెలంగాణ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఉన్నాయి. అందుకే రెండింటి మధ్య సమన్వయం కుదిరింది. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే లక్ష్యం.
Fourth Industrial Revolution in HYD : ప్రపంచ ఆర్థిక వేదిక అంతర్జాతీయ స్థాయిలో పని చేస్తుంటే, తెలంగాణ సర్కార్ రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలపై దృష్టి కేంద్రీకరిస్తోంది. ఉభయుల భాగస్వామ్యంతో ప్రజలకు మంచి జీవితం, ఆరోగ్యం, సాంకేతికత అందించాలనే లక్ష్యాలను వేగంగా అందుకోవచ్చు. ప్రపంచ స్థాయిలో ఆరోగ్య సంరక్షణ విధానాలను సరి కొత్తగా పునర్నిర్వచించే ఆలోచనలు ఉన్నాయి. చిన్న పట్టణాలు, గ్రామాలకు ఈ సేవలను అందించేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధంగా ఉంద' అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
దావోస్‌లో 'ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ' క్యాంపెయిన్ - పెట్టుబడుల వేట షురూ చేసిన సీఎం రేవంత్
CM Revanth Reddy Agreement with World Economic Forum : ప్రపంచ ఆర్థిక వేదికకు సంబంధించిన సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ నెట్‌వర్క్ ఇప్పటి వరకు అయిదు ఖండాల్లో విస్తరించి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పనున్న ఈ కేంద్రం ప్రపంచంలో 19వది. అయితే దీనికి అనుబంధంగా ఆరోగ్య సంరక్షణ, జీవ వైద్య శాస్త్ర కేంద్రం ఏర్పాటు చేయనుండడం ఇదే తొలిసారి అవడం గమనార్హం. ఆసియాలోనే జీవ వైద్య శాస్త్ర రంగానికి హైదరాబాద్ నగరంను ముఖ్య కేంద్రంగా పరిగణించనున్నారు. అలాగే దీనికి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. లాభాపేక్ష లేని సంస్థ ఇది. ఆరోగ్య సంరక్షణ, జీవ వైద్య శాస్త్ర విధానాల రూపకల్పన, పరిపాలన అంశాలపై ఇది దిశానిర్దేశం చేస్తుంది.
రాష్ట్రంలో వచ్చే అయిదేళ్లలో 20 వేల స్టార్టప్ ఇంక్యుబేటర్లను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్‌లో సీ4ఐఆర్ ప్రారంభంతో ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని, కొత్త ఆవిష్కరణలకు స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. తెలంగాణను 'హెల్త్ టెక్ హబ్'గా, ప్రపంచ గమ్యస్థానంగా మార్చటంపై సర్కార్ ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని, గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ సేవలను అందించే సంకల్పంతో పని చేస్తుందని ఆయన తెలిపారు. సెంటర్ ఫర్ హెల్త్‌కేర్ హెడ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు శామ్ బిషెన్ మాట్లాడుతూ, అందరికీ ఆరోగ్య సంరక్షణకు అవసరమైన సాంకేతిక విధానాల లభ్యతకు ఈ ఒప్పందం దోహదపడుతుందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
ప్రపంచ వేదికపై తెలంగాణ : దావోస్‌లో జరుగుతున్న ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటేలా రూపొందించిన ఈ వేదిక సదస్సుకు హాజరైన వారిని ఆకర్షిస్తోంది. చారిత్రక చార్మినార్ కట్టడం, బతుకమ్మ, బోనాల పండుగలు, చేర్యాల పెయింటింగ్, పోచంపల్లి ఇక్కత్ చీరలు, టీ హబ్, స్వైరూట్ ఏరోస్పేస్ ఇలా విభిన్న అంశాల మేళవింపుతో తయారు చేసిన 'వాల్ డిజైనింగ్' ఈ పెవిలియన్‌కు ప్రత్యే ఆకర్షణగా నిలిచాయి. భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు, 'మీ కోసమే తెలంగాణ' అంటూ సీఎం రేవంత్‌రెడ్డి హోర్డింగ్ ప్రపంచ దిగ్గజ కంపెనీలను ఆకట్టుకునేలా ఉంది.
భారీ పెట్టుబడులే టార్గెట్ - నేటి నుంచి సీఎం రేవంత్ దావోస్ పర్యటన
భారీ పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ బృందం భేటీలు : ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా 'తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి' అనే ప్రచారాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం విజయవంతంగా ప్రారంభించింది. ఇందులో భాగంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి భారీ పెట్టుబడులే లక్ష్యంగా ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి వరుసగా సమావేశాల్లో పాల్గొంటున్నారు. దావోస్ పర్యటనలో ఆయన మంగళవారం ప్రపంచ ఆర్థిక వేదిక అధ్యక్షుడు బర్గె బ్రెండ్‌తో సమావేశమయ్యారు. ఆయనతో తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యాలను వారికి వివరించారు. తర్వాత ఇథియోపియా ఉప ప్రధానమంత్రి డెమెక్ హసెంటోతో సమావేశమయ్యారు.
పారిశ్రామిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న రూట్ మ్యాప్‌పై చర్చించారు. అనంతరం నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్(నాస్కమ్) అధ్యక్షురాలు దేబ్జానీ ఘోశ్తో సీఎం రేవంత్ బృందం సమావేశమైంది. రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించడం, ఇందుకోసం అనుసరించే భవిష్యత్ కార్యచరణపై ఈ సందర్భంగా చర్చించారు. ఇంజినీరింగ్, డిగ్రీ కోర్సులు చదువుతున్న యువతకు స్కిల్ డెవలప్‌మెంట్, ఉద్యోగాల కల్పనకు సాయం తదితర అంశాలపై సంప్రదింపులు చేశారు. యూపీఎల్ గ్రూప్ సంస్థల సీఈవో జయ్‌ష్రాఫ్‌తో మంత్రి శ్రీధర్ బాబు చర్చించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆయనను మంత్రి కోరారు.
జ్యూరిచ్‌కు చేరుకున్న రేవంత్ బృందం - పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యమని వెల్లడి
సీఎం రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటన ఖరారు - ఈనెల 15న జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరు