బంగారు తెలంగాణ కోసం నిరంతరం పాటు పడిన వ్యక్తి బూర్గుల నర్సింగరావు అని.. సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ రూపొందించిన 'స్వాప్నికుడి నిష్క్రమణ-బూర్గుల నర్సింగరావు స్మృతిలో' అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. హైదరాబాద్ హిమయత్ నగర్లోని మఖ్ధూం భవన్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు.
బూర్గుల.. నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ తెలంగాణ సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారని సుధాకర్ గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పాటుపడేవారన్నారు. నిజాం కళాశాల కార్యదర్శిగా, ఎఐఎస్ అధ్యక్షుడిగా, జర్నలిస్టుగా.. సమాజానికి చేసిన సేవలను ఆయన కొనియాడారు.
నర్సింగరావు.. చిన్నప్పటి నుంచే కమ్యూనిస్టులతో మమేకమై తుది శ్వాస వరకు అంకిత భావంతో పని చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో దుర్మార్గ పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. కేంద్రం విధానాలు.. కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూరేలా ఉన్నాయని విమర్శించారు. బూర్గుల ఆశయాలను.. యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: యాదాద్రి ఆలయంలో మరో 32 మంది సిబ్బందికి కరోనా