Daggubati Venkateswara Rao Sensational Decision: రాజకీయాలకు తాను, తన కుమారుడు హితేష్ స్వస్తి చెపుతున్నామని ఎన్టీఆర్ పెద్ద అల్లుడు మాజీమంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రకటించారు. ఏపీలోని బాపట్ల జిల్లా ఇంకొల్లులో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల వేదికపై ఈ ప్రకటన చేశారు. రాత్రి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంకొల్లుతో తనకున్న అనుబంధంతో ఇక్కడ తన మనసులోని మాట చెప్పానని వివరించారు.
డబ్బుతో రాజకీయం, కక్ష సాధింపులకు దిగటం తమ కుటుంబానికి అలవాటు లేదని దగ్గుబాటి అన్నారు. గతంలో రాజకీయాలకు.. ప్రస్తుత రాజకీయాలకు పొంతన లేదని.. అందుకే హితేష్, తాను రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. గత ఎన్నికల్లో పర్చూరు నుంచి వైసీపీ తరపున పోటీచేసి దగ్గుబాటి ఓటమి పాలయ్యారు. గత రెండు రోజుల క్రితం పర్చూరు వైసీపీ ఇన్ఛార్జిగా ఆమంచి కృష్ణమోహన్‌ను అధిష్టానం నియమించింది. ఈ నేపథ్యంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాల్లో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం పర్చూరు నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.
"నేను కానీ.. మా అబ్బాయి కానీ.. ప్రస్తుత రాజకీయాలలో ఇమడలేము. ఇంతటితో ఈ ప్రజాజీవితానికి ముగింపు పలకాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకప్పటి రాజకీయాలు వేరు.. ప్రస్తుత రాజకీయాలు వేరు. ప్రస్తుత రాజకీయాలు డబ్బుతో ముడిపడి జరుగుతున్నాయి". - దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మాజీమంత్రి
ఇవీ చదవండి: