Former Minister Chandrasekhar Resigned from BJP : బీజేపీ క్రియాశీలక సభ్యత్వానికి మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు నుంచి.. చంద్రశేఖర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అసంతృప్తితో ఉన్న చంద్రశేఖర్‌ను స్వయంగా ఇంటికి వెళ్లి ఈటల రాజేందర్ బుజ్జగించారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలిపించుకుని మాట్లాడిన తరువాత కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు.
Former Minister Chandrashekar Left from Telangana BJP : కేసీఆర్ సర్కారు అరాచక పాలనను ఎదురించడం బీజేపీతోనే సాధ్యమని నమ్మి.. అనేక మంది ఉద్యమకారులం బీజేపీలో చేరామన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుకు.. కేసీఆర్ అవినీతి తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్కు మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని విమర్శలు సైతం చేశారు. అన్ని తెలిసి కూడా కేంద్ర సర్కారు తెలంగాణ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ.. ప్రజా కంటకంగా మారిందని తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి మార్పు నచ్చలేదు.. బీజేపీ పార్టీకి రాజీనామాపై చంద్రశేఖర్ స్పందించారు. గత మూడేళ్లుగా బీజేపీలో కొనసాగానని.. తనతో పాటు అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు బీజేపీలో చేరినట్లుగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలకు భిన్నంగా కేసీఆర్ వ్యవహరించారని విమర్శించారు. కేసీఆర్ సర్కార్‌ను బీజేపీ జాతీయ నాయకత్వం విమర్శించిందే తప్ప.. ఎటువంటి చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ని తొలగించడం తనకు నచ్చలేదన్నారు. ప్రజలలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని స్పష్టంగా అర్థమవుతోందని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్‌లో చేరుతానని.. చేవెళ్ల, జహీరాబాద్‌లోని ఏదో ఒక స్థానం ఎంచుకోవాలని రేవంత్ సూచించినట్లు పేర్కొన్నారు.
చంద్రశేఖర్ ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేశారు. వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా 1985 నుంచి 2008 వరకు వరుసగా 5 సార్లు ఎన్నికయ్యారు. వికారాబాద్ నుంచి 2018 శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. పెద్దపల్లి నుంచి 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం బీజేపీలో చేరారు.
Telangana BJP 2023 Elections Plan : 'పార్టీ బలహీనంగా ఉన్న చోట త్వరితగతిన బలోపేతం చేయాలి'