Food Adulteration In Hyderabad : "డబ్బు సంపాదించడమే అంతిమం.. దానికోసం ఎన్ని అడ్డదారులు తొక్కినా పర్వాలేదు" అన్నట్టుగా ఉంటోంది కొందరు వ్యాపారుల తీరు. చివరకు కడుపుకు తినే తిండిని కూడా వదలట్లేదు. హైదరాబాద్లో ఇక్కడా అక్కడా అనే తేడాలేకుండా మెజారిటీ చోట్ల ఆహార కల్తీ జరుగుతోంది. సాక్షాత్తూ.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తాజాగా విడుదల చేసిన నివేదికలోని అంశాలు విస్తుగొలుపుతున్నాయి. భాగ్యనగరంలో ఆహార కల్తీ ఏ స్థాయిలో జరుగుతుందో వెల్లడించింది.
దేశంలోనే మొదటి స్థానం :
ఆహార కల్తీలో హైదరాబాద్ నగరం మొదటి స్థానంలో నిలిచింది. 2022 సంవత్సరంలో దేశంలోని 19 ప్రధాన నగరాల్లో మొత్తం 291 ఆహార కల్తీ కేసులు నమోదు అయ్యాయి. అందులో ఏకంగా 246 కేసులు ఒక్క హైదరాబాద్‌లోనే నమోదవడం గమనించాల్సిన అంశం. ఐపీసీ సెక్షన్లు 272, 273, 274, 275, 276 కింద కేసులు నమోదు చేశారు. అంటే.. 19 నగరాల్లో నమోదైన కేసుల్లో 84 శాతం కేసులు హైదరాబాద్‌లోనే నమోదయ్యాయన్నమాట.
ఇక రాష్ట్రాల వారీగా చూసుకుంటే.. దేశవ్యాప్తంగా 2022లో 4,694 ఆహార కల్తీ కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇందులో తెలంగాణ వ్యాప్తంగా 1,631 ఆహార కల్తీ కేసులు నమోదయ్యాయి. ఇది దేశం మొత్తంలో నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు 35 శాతానికి సమానం. 2021లో కూడా భారీగానే కేసులు నమోదు చేశారు. ఇంత పెద్ద మొత్తంలో ఆహార కల్తీ కేసులు బయట పడటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం కేసులు నమోదైనవే ఇన్ని ఉంటే.. దొరక్కుండా తప్పించుకుంటున్నవి ఇంకా ఎన్ని ఉండొచ్చని చర్చించుకుంటున్నారు.
అత్యాశతో :
డబ్బులను ఎక్కువగా సంపాదించాలనే అత్యాశతో కొందరు వ్యాపారులు జనాల ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ సిటీలో కల్తీ ఆహారం తయారు చేస్తున్న వారిపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాపారులు ఇస్తున్న మామూళ్లు తీసుకొని.. నామమాత్రపు తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారని మండిపడుతున్నారు. ఇక.. స్ట్రీట్ ఫుడ్, చిన్నచిన్న టిఫిన్ సెంటర్లలో నాణ్యతను పరిశీలించే దిక్కు కూడా లేదని జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆహార పదార్థాల కోసం ఏ నూనెలు వాడుతున్నారో.. ఎన్నిసార్లు వేడి చేసిన నూనె ఉపయోగిస్తున్నారో కూడా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. దీని వల్ల బయట తినేవారు డబ్బులను చెల్లించి మరీ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏవో కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించడం.. నాసిరకం ఫుడ్, అపరిశుభ్రత, కల్తీ ప్రొడక్ట్స్ కనిపిస్తే నోటీసులు ఇవ్వడం.. నామమాత్రపు ఫైన్ విధించి వదిలేయడం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనివల్ల ఆహారం కల్తీ చేసేవారికి భయం లేకుండా పోతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో.. బయట తిండి తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బయట లభించే ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని.. ఇంట్లోనే తాజాగా వండుకుని తినడం మేలని సూచిస్తున్నారు. అనవసరంగా బయట తిని ఆరోగ్యం పాడు చేసుకోవద్దని చెబుతున్నారు.