భాగ్యనగరాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి పలు కాలనీలు జలమయం అయ్యాయి. పాతబస్తీ శివారులోని గుర్రం చెరువు కట్ట తెగింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ఉప్పగూడ, సాయిబాబా నగర్, శివాజీనగర్, బాబా నగర్ బస్తీలను వరద ముంచెత్తింది.
సరూర్‌నగర్ మినీట్యాంక్‌బండ్ వద్ద కాలనీల్లోకి నీరు చేరింది. కోదండరామ్‌నగర్, కీసలబస్తీ, కమలానగర్‌లో ఇళ్లలోకి చేరడం వల్ల విద్యుత్ సరఫరా నిలిపివేశారు. హయత్‌నగర్ పరిధి అంబేడ్కర్‌నగర్, భగత్‌సింగ్, లేబర్ కాలనీల్లోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మల్లాపూర్ బ్రహ్మపురికాలనీ, భవానీనగర్, వనస్థలిపురం హరిహరపురం కాలనీలోని పలు ఇళ్లలోకి నీరు చేరింది. కాప్రా చెరువు దిగువన ఉన్న14 కాలనీల్లోని ఇళ్లు వరదలో చిక్కుకున్నాయి.
ఉప్పల్ నల్లచెరువు వద్ద డీసీఎం వ్యాను గుంతలో ఇరుక్కుపోయింది. ఉప్పల్ చిలుకానగర్‌లో విద్యుదాఘాతంతో ప్రైవేట్ స్కూల్ యజమాని మృతి చెందారు. స్కూల్ బిల్డింగ్ సెల్లార్‌లోని నీటిని మోటార్‌తో తొలగించే క్రమంలో శ్రీనివాస్ విద్యుదాఘాతానికి గురయ్యారు.
దిల్సుఖ్నగర్ పరిధిలోని శ్రీనగర్ కాలనీ, ఈఎన్‌టి కాలనీ, కమలానగర్ సహా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నిన్న రాత్రి 10 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల స్థానికుల ఇబ్బందులు పడుతున్నారు.
నదీమ్ నగర్, నిజం కాలనీ, బాల్‌రెడ్డినగర్ కాలనీ, విరాసత్‌నగర్ కాలనీల ప్రజలు వరద గుప్పిట్లో చిక్కుకున్నారు. హైదరాబాద్ హర్స్ రైడింగ్ స్కూల్ వారు గుర్రాల ద్వారా ఇంటింటికి పాలు, కూరగాయలు అందించే ప్రయత్నం చేస్తున్నారు. మంగళ్‌హట్ ఆర్‌కేపేటలో గోడకూలీ ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది.
ఇదీ చదవండి: నాగార్జునసాగర్ 18 క్రస్టు గేట్లు ఎత్తి నీటి విడుదల