హైదరాబాద్ బాగ్ లింగంపల్లి పరిధిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మత్స్యశాఖలో జరుగుతున్న అవినీతిపై మత్స్యకారులు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ఉచిత చేప పిల్లల పథకంలో భారీ స్థాయిలో అవినీతి జరుగుతుందని సంఘం ఉపాధ్యక్షుడు ముఠా విజయ్ కుమార్ బెస్త ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే చేప పిల్లల టెండర్లను రద్దు చేయాలని గంగపుత్రులు డిమాండ్ చేశారు. టెండర్లు దక్కించుకుంటున్న కాంట్రాక్టర్లు నాసిరకం చేప పిల్లలు పంపిణీ చేసి తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం బడా వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, దళారీలు దోచుకుంటున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమకు లబ్ధి జరగాలంటే మత్స్య సహకార సంఘం ఖాతాల్లోనే ఆయా చేప పిల్లల నిధులు జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం పంపిణీ చేస్తోన్న ఉచిత చేప పిల్లల విషయంలో గ్రామస్థులు కూడా అందులో తమకు హక్కుందని అంటున్నారని కందికల్ మత్స్య సొసైటీ కార్యదర్శి బైరి వినోద్ కుమార్ బెస్త మండిపడ్డారు. మరోవైపు ప్రభుత్వం సరఫరా చేసే చేపలు నాసిరకంగా ఉంటున్నాయని పేర్కొన్నారు. అందువల్ల ఉచిత చేప పిల్లలు కాకుండా మత్స్య సహకార సంఘాల సొసైటీలకే నిధులు అందించాలని అర్వపల్లి శ్రీరాములు విజ్ఞప్తి చేశారు. ఇకనైనా తమను దళారీలు, కాంట్రాక్టర్ల బారి నుంచి కాపాడి మత్స్య సొసైటీలను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను మధు బెస్త కోరారు.