కొవిడ్ ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాలపై రాష్ట్ర ప్రభుత్వ అప్రమత్తమైంది. ప్రతి ఒక్క కొవిడ్ ఆస్పత్రి, క్వారంటైన్ సెంటర్లలో ఫైర్ సేఫ్టీ చర్యలను దగ్గరగా పర్యవేక్షిస్తున్నామని రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల విభాగం ప్రకటించింది. గాంధీ ఆస్పత్రి, టిమ్స్ ఆస్పత్రుల వద్ద అగ్ని మాపక వాహనాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది.
విద్యుత్, అగ్ని ప్రమాదాలు జరగకుండా సురక్షితంగా ఉండేలా ప్రతి ఒక్క ఆస్పత్రి జాగ్రత్త వహించాలని.. అగ్నిమాపక పరికరాలు పనిచేసే విధంగా చూసుకోవాలని కోరింది. ఆస్పత్రి సిబ్బందికి ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన చర్యలు, ప్రాథమిక వైద్యానికి సంబంధించిన శిక్షణ ఇవ్వాలని సూచించింది.
అగ్నిమాపక చర్యలు తీసుకోవటంపై ఇప్పటికే ఆస్పత్రుల యాజమాన్యంతో సమావేశం నిర్వహించామని పేర్కొంది. ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదం సంభవించట్లైతే 101 నంబర్ ద్వారా అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరింది.