కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా పోస్టుల వర్గీకరణ పూర్తి చేసి, ఖాళీలను గుర్తించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని శాఖలు దాదాపుగా కసరత్తు పూర్తి చేశాయి. ఆయా శాఖలకు కేటాయించిన పోస్టులు, జోనల్ వ్యవస్థకు అనుగుణంగా వర్గీకరణ, పనిచేస్తున్న వారు, ఖాళీలు, తదితరాలకు సంబంధించి అంశాలను ఆయా శాఖలు తెలుసుకున్నాయి. సంబంధిత మంత్రులు కూడా అధికారులతో సమీక్షించారు.
అధికారులతో మంత్రుల సమీక్ష...
ఖాళీల వివరాలపై సోమవారం ఆర్థికశాఖ కసరత్తు చేసింది. శాఖల వారీగా ఖాళీల విషయమై ఆర్ధికమంత్రి హరీష్ రావు... మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాఠోడ్, అధికారులతో చర్చించారు. ఆయా శాఖలు రూపొందించిన నివేదికలను పరిశీలించారు. శాఖలు, విభాగాల్లో పనిచేస్తున్న ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది వివరాలను కూడా ప్రత్యేకంగా పొందుపరిచారు. కసరత్తులో భాగంగా దశాబ్దాల క్రితం నాటి ఉత్తర్వులను కూడా అధికారులు పరిశీలించారు. అన్ని శాఖల్లో కేడర్ వర్గీకరణ ప్రక్రియ పూర్తి కాగా... కొన్ని శాఖల్లో కొంత వ్యత్యాసం ఉన్నట్లు సమాచారం.
అన్ని వివరాలు వచ్చాకే...
గురుకుల విద్యాసంస్థల సొసైటీలు సహా కొన్ని సంస్థల పోస్టుల విషయంలో స్పష్టత రావాల్సి ఉందని అధికారులు అంటున్నారు. ఆయా శాఖల నుంచి వచ్చిన వివరాలను పరిశీలించాకే మొత్తం పోస్టులు, ఖాళీల వివరాలను సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. ఒప్పంద, పొరుగు సేవల సిబ్బంది వివరాలను కూడా అందులో పొందుపరచనున్నారు. అన్నింటినీ క్రోడీకరించి ముఖ్యమంత్రి కేసీఆర్కు నివేదించనున్నారు.
మొత్తం 60 వేల ఖాళీలున్నట్లు సమాచారం...
ఇప్పటి వరకు మొత్తం 60 వేల వరకు ఖాళీలు ఉండవచ్చని తెలుస్తోంది. ఇందులో మూడు, నాలుగో తరగతి ఉద్యోగాల ఖాళీలు కూడా ఉన్నట్లు సమాచారం. 50 వేల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఇప్పటికే ఆదేశించారు. తదుపరి జరిగే మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: CM KCR: 'కోరుకున్న పథకాలతో నిరంతర ఉపాధి కల్పించడమే దళిత బంధు పథకం లక్ష్యం'