పురపాలక ఎన్నికల కసరత్తులో భాగంగా ఇవాళ వార్డుల వారీ ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. 3 కార్పొరేషన్లు, 129 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణ కోసం వార్డుల వారీ ఓటర్ల జాబితా ముసాయిదాను ఈ నెల 10న ప్రకటించారు. రాజకీయ పార్టీలతో స్థానికంగా సమావేశం నిర్వహించడంతో పాటు ముసాయిదాపై అభ్యంతరాలు స్వీకరించారు. వాటన్నింటిని పరిష్కరించి ఇవాళ వార్డుల వారీ ఓటర్ల తుది జాబితాలను విడుదల చేయనున్నారు. ఈ జాబితాల ఆధారంగానే పురపాలక ఎన్నికలు నిర్వహిస్తారు. వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల వివరాలను కూడా ప్రకటిస్తారు. ఈ వివరాల ఆధారంగా కొత్త పురపాలక చట్టంలో ప్రభుత్వం పేర్కొనే శాతానికి అనుగుణంగా వార్డుల వారీ రిజర్వేషన్లు ఖరారు చేస్తారు.
పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా....
పోలింగ్ కేంద్రాల ముసాయిదాను కూడా ఈరోజు ప్రకటిస్తారు. గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ఉపయోగించిన పోలింగ్ కేంద్రాలనే ఇక్కడ కూడా వినియోగించనున్నారు. బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహిస్తున్నందున ఒక్కో పోలింగ్ కేంద్రంలో గరిష్ఠంగా 800 మంది ఓటర్లు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైతే కొత్త పోలింగ్ కేంద్రాలు లేదా అనుబంధ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. పోలింగ్ కేంద్రాల ముసాయిదాపై కూడా అభ్యంతరాలను స్వీకరించి ఈ నెల 19 న తుదిజాబితా ప్రకటిస్తారు. అదే రోజుతో నూతన పురపాలక చట్టం కూడా ఉభయసభల ఆమోదం పొందనుంది. ఆ వెంటనే పురపోరుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
ఇవీ చూడండి: మంత్రి ఈటల రాజేందర్‌కు నిరసన సెగ