Fight for YCP Party Ticket Heirs: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీలో వర్గపోరు, కుమ్ములాటలకు తోడు ఇప్పుడు నేతల వారసుల మధ్య సీటు కోసం పోటీ పెరుగుతోంది. ఈసారి సీటు మా వాడికంటే మా వాడికేనంటూ కొందరు ఎమ్మెల్యేలు పట్టుబడుతుండటంతో కొన్ని నియోజక వర్గాల్లో పోటీ సంక్లిష్టంగా మారుతోంది. మరోవైపు ఇతర నియోజకవర్గాల్లోనూ కొందరు ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో తమ వారసులను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతున్నారు.
మరికొందరయితే తమ వారసులకు మార్గం సుగమం చేసేందుకు రాజకీయాలకు రిటైర్మెంటూ ప్రకటించేస్తున్నారు. ఎమ్మిగనూరు, రామచంద్రాపురం, ఎలమంచిలి తదితర నియోజకవర్గాల్లో వారసత్వ పోరు ముమ్మరంగా ఉంది. వయోభారంవల్ల పోటీ చేయలేకపోతున్నా, నా కుమారుడికి టికెట్ ఇవ్వండని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వైసీపీ అధిష్ఠానాన్ని కోరడంతో సానుకూల స్పందన వచ్చిందంటున్నారు.
తమ సొంత నియోజకవర్గం ఎమ్మిగనూరులో తన కుమారుడు ధరణీధర్‌రెడ్డికిగానీ, తన అన్న కుమారుడు ప్రదీప్‌రెడ్డికిగానీ టికెట్ ఇవ్వాలంటూ మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పట్టుబడుతున్నారు. కాబోయే ఎమ్మెల్యే ధరణీధర్‌రెడ్డి అంటూ ఇప్పటికే ఎమ్మిగనూరులో ఆయన వర్గీయులు ఫ్లెక్సీలు పెడుతుండటం గమనార్హం. ఈ పరిణామాలతో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య అంతరం పెరిగిందంటున్నారు. బాలనాగిరెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్ష పదవి వదులుకోవడానికి ఇదీ ఒక కారణమని చెబుతున్నారు.
రామచంద్రపురంలో రసవత్తరం: రామచంద్రపురంలో ముక్కోణ పోటీ నెలకొంది. మంత్రి వేణుగోపాలకృష్ణ కుమారుడు నరేన్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్యప్రకాష్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వారసుడు పృథ్వీరాజ్ పోటాపోటీగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవలే త్రిమూర్తులును మండపేట అభ్యర్థిగా ముఖ్యమంత్రి ఖరారు చేశారు. దీంతో పృథ్వీ మండపేటకే పరిమితమని, టికెట్ తమదేనంటూ మిగిలిన రెండు వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. మండపేట ఖరారైనా సొంత నియోజకవర్గం రామచంద్రపురాన్ని ఎలా వదులుకుంటామని త్రిమూర్తులు వర్గీయులు ప్రశ్నిస్తున్నారు.
ఎలమంచిలి ఎవరికి?: ఈసారి అనకాపల్లిలో కాకుండా ఎలమంచిలిలో పోటీకి దిగాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఎలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తిరాజు ఈ ఎన్నికల్లోనే తన కుమారుడు సుకుమార్ వర్మను బరిలోకి దింపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. డీసీసీబీ ఛైర్మన్‌గా పని చేసిన సుకుమార్ రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
* పాణ్యం నియోజకవర్గంలో తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బైరెడ్డి కుటుంబ వారసుడిగా శాప్ ఛైర్మన్ సిద్ధార్థ్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి తన కుమారుడు నరసింహారెడ్డికి రంగం సిద్ధం చేస్తుండటంతో ఇరువర్గాల మధ్య పోటీ నెలకొంది. పాణ్యంలో కుదరకపోతే నంద్యాల ఎంపీగానైనా పోటీ చేయాలని సిద్ధార్థ్‌రెడ్డి యోచిస్తున్నట్లు జిల్లాలో చర్చ జరుగుతోంది.
ఇక పోటీ చేయం: మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని, తిరుపతి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, ఎర్రకోట చెన్నకేశవరెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమని ఇప్పటికే ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడే పోటీ చేస్తారని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి బహిరంగంగానే చెప్పేశారు. అయితే వీరిలో ఇద్దరు ముగ్గురితో సీఎం జగన్ మాట్లాడి ఈసారికి మీరే పోటీ చేయండని చెప్పారంటున్నారు.
మరి వారు కొనసాగుతారా.. విరమించుకుంటారా.. అనేది చూడాలి. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. దీంతో 2019లో చెన్నకేశవరెడ్డే పోటీ చేసి గెలిచారు. వయోభారం కారణంగా పోటీ నుంచి విరమించుకుంటున్నానని, మళ్లీ తన బిడ్డకే అవకాశమివ్వాలని ఆయన అధిష్ఠానాన్ని కోరుతున్నారు. భూమన తనయుడు అభినయ్‌రెడ్డి ప్రస్తుతం తిరుపతి రెండో డిప్యూటీ మేయర్‌గా ఉన్నారు.
మచిలీపట్నంలో నియోజకవర్గ పూర్తి బాధ్యతలతోపాటు, గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తే (కిట్టూ) నిర్వహిస్తున్నారు. ధర్మాన ప్రసాదరావు కుమారుడు మనోహర్ నాయుడు శ్రీకాకుళం నియోజకవర్గంలో రాజకీయ కార్యక్రమాలతోపాటు కార్యకర్తల సమావేశాలనూ నిర్వహిస్తున్నారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఈసారి తన బదులు వారసుణ్ని బరిలోకి దింపే యోచనలో ఉన్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు.
ఇప్పుడే ఎందుకు?: ఎమ్మెల్యేలు వారసులను ఇప్పుడే ఎందుకు రంగంలోకి దించాలనుకుంటున్నారనే విషయంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ‘అధికారంలో ఉన్నాం కాబట్టి వారసులను ఇప్పుడే బరిలోకి దింపి గెలిపించుకోగలిగితే రాజకీయంగా స్థిరపడిపోతారు’ అన్న ఆలోచనతో కొందరు ఎమ్మెల్యేలు/నేతలు ఉన్నారన్న చర్చ ఒకవైపు సాగుతోంది. కొందరు తమ అనుభవానికి తగిన ప్రాధాన్యం పార్టీలో దక్కడం లేదని.. అలాంటప్పుడు ఆగిపోవడం మంచిదనే ఉద్దేశంతోనే వారసులను తెరపైకి తీసుకొస్తున్నారన్న చర్చా ఉంది. వయోభారం, అనారోగ్యం, పని ఒత్తిడి ఇలాంటి కారణాలతో వారసులను తెరపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో పార్టీ అధ్యక్షుడి వైఖరేమిటనేది తేలాల్సి ఉంది.
శ్రీకాకుళం జిల్లాలో:
* నర్సన్నపేటలో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ కుమారుడు, పోలాకి జడ్పీటీసీ సభ్యుడు కృష్ణచైతన్య మొత్తం నియోజకవర్గ బాధ్యతలను చూసుకుంటున్నారు.
* ఆమదాలవలసలో శాసనసభాపతి తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి వెంకటనాగ్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో తిరుగుతున్నారు.
* విజయనగరంలో ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి తన కుమార్తె, విజయనగరం డిప్యూటీ మేయర్ శ్రావణిని వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు.
* ఒంగోలులో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్‌రెడ్డి ఇప్పటికే నియోజకవర్గంలో సగానికిపైగా పర్యటించారు. ఇంటి దగ్గరే ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారం కోసం నేరుగా అధికారులతోనూ మాట్లాడుతుండటం గమనార్హం.
* ‘పార్టీ అధిష్ఠానం అనుమతిస్తే నా కుమారుణ్ని బరిలో దింపుతా’ అని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి గతంలో బహిరంగంగానే ప్రకటించారు. ఇటీవల ఆయన అనారోగ్యం కారణంగా గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో చేపట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు కార్తీక్‌రెడ్డి సొంతంగానే నియోజకవర్గమంతా తిరుగుతున్నారు. చక్రపాణి సోదరుడు శిల్పా మోహన్‌రెడ్డి తన కుమారుడు రవిచంద్ర కిశోర్‌రెడ్డిని 2019 ఎన్నికల్లోనే బరిలోకి దింపి గెలిపించుకున్నారు. సోదరుడి కుమారుడు ఇప్పటికే ఎమ్మెల్యే అయిపోవడం, మరోవైపు తన అనారోగ్యం నేపథ్యంలో చక్రపాణి ఈసారి తన బిడ్డను రంగంలోకి దించడం ఖాయమన్న చర్చ జరుగుతోంది.
* గాజువాకలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు, కార్పొరేటర్ వంశీ తండ్రితోపాటు రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
* కరోనా సమయంలో విజయనగరం, చీపురుపల్లిలలో సేవా కార్యక్రమాలను చేపట్టిన మంత్రి బొత్స సత్యనారాయణ తనయుడు సందీప్ వచ్చే ఎన్నికల్లో బరిలో నిలుస్తారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగింది. అయితే సందీప్ రాజకీయ కార్యకలాపాల్లో ఎక్కడా కనిపించడం లేదు.
కుమార్తెలు సైతం:
* వచ్చే ఎన్నికల్లో తన కుమార్తె నూర్ ఫాతిమాకు టికెట్ ఆశిస్తున్నట్లు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా బహిరంగంగానే చెబుతున్నారు. ఫాతిమా ఇప్పటికే తండ్రితోపాటు రాజకీయ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.
* మాడుగులలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు కుమార్తె, కె.కోటపాడు జడ్పీటీసీ సభ్యురాలు అనురాధ పోటీకి సిద్ధమవుతున్నారు.
ఇవీ చదవండి: గ్రూప్1 ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడించిన టీఎస్పీఎస్సీ.. ఒక్కో పోస్టుకు ఎంతమందో తెలుసా?
'విద్వేషపూరిత ప్రసంగాలతో ముప్పు.. TV ఛానెళ్లు హింసకు పాల్పడితే కఠిన చర్యలు'