379 Types of Dishes : సంక్రాంతికి ఇంటికి వచ్చిన కొత్తల్లుడికి 379 రకాల వంటకాలతో విందు భోజనం వడ్డించి ఆశ్చర్యపరిచారు. అదేదో సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్లు.. ఇంత ఎవరైనా తింటారా సార్.. మీరు కూడా తినలేరు అంటూ డైలాగ్ చెప్పే పరిస్థితి ఆ కొత్త అల్లుడికి వచ్చింది. కొత్తగా వచ్చిన అల్లుడు గోదారోళ్ల మర్యాదలు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేసి ఇక ఆ టేబుల్ మొత్తం ఎక్కడా ఖాళీ లేకుండా అన్ని వంటకాలతో నింపేశారు ఏలూరుకు చెందిన దంపతులు.
ఏలూరు నగరం దొంగల మండపానికి చెందిన భీమారావు, చంద్రలీల దంపతులు గతేడాది ఏప్రిల్లో అనకాపల్లికి చెందిన మురళీతో తమ కుమార్తెకు వివాహం జరిపించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కుమార్తె, అల్లుడు ఇంటికి రాగా.. అల్లుడికి కనీవినీ ఎరుగని రీతిలో ఏదైనా చేయాలని సంకల్పించిన అత్తగారు.. పిండివంటలు, కూరలు, వేపుళ్లు, స్వీట్లు, పండ్లు, శీతల పానీయాలు, కారప్పొడులు, పచ్చళ్లు.. ఇలా 379 రకాల వంటకాలను సిద్ధం చేశారు.
వాటన్నింటినీ దంపతులిద్దరూ అటు అల్లుడు, ఇటు కూతురికి కొసరి కొసరి తినిపించారు. గోదావరి జిల్లాలు సంస్కృతి, సంప్రదాయాలకు నిలయాలనీ.. ఇక్కడి అతిథి మర్యాదలను వైభవంగా చాటాలనే ఉద్దేశంతోనే ఇన్ని రకాల వంటకాలను సిద్ధం చేసి తమ అల్లుడిని ఆశ్చర్యపరిచినట్లు భీమారావు దంపతులు తెలిపారు.
ఇవీ చదవండి:
కొత్తల్లుడికి మరీ 173 వంటకాలా.. ఈ గోదారోళ్ల మర్యాదలు సల్లగుండా..