రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాలకు అవసరమైన మొక్కలు సరఫరా చేసేలా సిద్దిపేట జిల్లా ములుగు సమీపంలో 20 ఎకరాల్లో సెంట్రల్ నర్సరీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ప్రతిపాదించింది. ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన ఎఫ్డీసీ మూడో వార్షిక సమావేశం ఆన్లైన్లో జరిగింది. పర్యావరణం, అటవీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని కార్పొరేషన్‌ను పునర్ వ్యవస్థీకరించాలని సమావేశంలో నిర్ణయించారు. యూకలిప్టస్ పెంపు లాంటి సంప్రదాయ పద్ధతుల నుంచి ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా మార్పులు చేయాలని.. ఆ దిశగా సంస్థను తీర్చిదిద్దాలని తీర్మానించారు. టెట్రా ప్యాక్‌లకు అవసరమైన పేపర్ బోర్డ్ మెటీరియల్ తయారీ, ఐకియా లాంటి సంస్థలకు కలప సరఫరా తదితర అవకాశాలను పరిశీలించాలని సమావేశంలో చర్చించారు.
ఎఫ్డీసీ కోసం హైదరాబాద్ కొత్తగూడలో కొత్త కార్యాలయ సముదాయాన్ని నిర్మించాలని.. ఎకో టూరిజం-ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కాంప్లెక్స్‌గా పేరు పెట్టాలని నిర్ణయించినట్లు ఛైర్మన్ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి అటవీ అభివృద్ధి సంస్థ విభజన ప్రక్రియ పూర్తయిందని.. అందుకు అనుగుణంగా రూ.51 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు జారీ చేసిందని సంస్థ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఎఫ్డీసీ 150 కోట్ల టర్నోవర్‌తో 95.49 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించినట్లు వివరించారు. కరోనా విపత్తు వేళ చనిపోయిన వారి దహన సంస్కారాలకు అవసరమైన కలపను ఇప్పటి వరకు 150 మెట్రిక్ టన్నులు ఉచితంగా సరఫరా చేసినట్లు తెలిపారు.